మరణం అంచున నరకయాతన! ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా పడి ఉంటే

8 Sep, 2022 05:07 IST|Sakshi
బ్రిడ్జి దిగువన చెక్కపై పడి ఉన్న బాధితుడు ,క్రేన్‌ సాయంతో ప్రదీప్‌కుమార్‌ను పైకి లాగుతున్న దృశ్యం

గోదావరి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టిన బైక్‌  

నదిలో పడే క్రమంలో వంతెనకు ఉన్న చెక్క బల్లపై పడిపోయిన బాధితుడు 

క్రేన్‌ సాయంతో రక్షించిన పోలీసులు    

ఆలమూరు: మరణానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరం ఉండి కొన్ని గంటల పాటు నరక యాతన అనుభవించి.. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కోనసీమ జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీకి చెందిన చిర్రా ప్రదీప్‌కుమార్‌ రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో హోమ్‌గార్డ్‌. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా గౌతమీ గోదావరి కొత్త వంతెనపై వాహనాన్ని తప్పించబోయి రైలింగ్‌ పక్కన ఉన్న కాంక్రీట్‌ గోడను ఢీకొట్టి గోదావరిలో జారి పోయాడు.

అదృష్టవశాత్తు గోదావరి నదికి, వంతెన పైభాగానికి మధ్యనున్న చెక్కబల్లపై పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ప్రదీప్‌కుమార్‌ హెల్మెట్‌ ధరించడం వల్ల బలమైన గాయాలు కాలేదు. గాయాలు తట్టుకోలేక, మరో పక్క గోదావరిలో పడిపోతానన్న  భయంతో ఆర్తనాదాలు చేశాడు. ఆ అరుపులు విన్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు, హైవే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.

క్రేన్‌ను తెప్పించి పోలీసులు కిందకు దిగి తాడు సాయంతో అతన్ని పైకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్‌హెచ్‌ 16 అంబులెన్స్‌ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించాక.. రావులపాలెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్‌కుమార్‌ ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా పడి ఉంటే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకున్నా పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. 

మరిన్ని వార్తలు