ఉద్యోగులను అందరికంటే మిన్నగా చూస్తాం

28 Aug, 2022 05:42 IST|Sakshi

మాది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వం 

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 

విజయనగరం గంటస్తంభం : తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయనగరం జెడ్పీ సమావేశంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారిని అందరికంటే మిన్నగా చూస్తామని తెలిపారు.

సీపీఎస్‌ రద్దు చేస్తామని తాము చెప్పామని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోయామని వివరించారు. ప్రత్యామ్నాయంగా వారికి ఎటువంటి నష్టం కలగకుండా కొత్త స్కీం తీసుకొస్తున్నామని, దానిపై కసరత్తు కొనసాగుతోందని చెప్పారు.

తాము ఇచ్చిన హామీల్లో 95శాతం నెరవేర్చామని, మిగిలిన ఐదు శాతంలో సీపీఎస్‌ రద్దు కూడా ఉందన్నారు. సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఉద్యోగులు కార్యాచరణ ప్రకటిస్తే పోలీసులు చూస్తూ ఎలా ఊరుకుంటారని అన్నారు. గతంలో ఉద్యమాల్లో కేసులు ఉన్న వారినే పోలీసులు బైండోవర్‌ చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో ఎవరిపై ఎవరు దాడి చేశారో టీవీల్లో చూశామన్నారు.

ఇప్పటివరకు అక్కడ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని, ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ పాగా వేయడంతో కడుపుమంటతో అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఐరిస్‌లో మార్పులు చేసిన తర్వాత ఉద్యోగులు, యూనియన్లలో వ్యతిరేకత లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.   

మరిన్ని వార్తలు