ఏపీలో టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌ 

8 Aug, 2020 04:15 IST|Sakshi
సీఎం వైఎఎస్‌ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న బ్రిటిష్‌ హైకమిషనర్‌ జాన్‌ థాంప్సన్‌

బ్రిటిష్‌ హైకమిషనర్‌ జాన్‌ థాంప్సన్‌ ప్రశంస

కరోనా మరణాలు అదుపులో ఉండడం అభినందనీయం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌

అంబులెన్స్‌ల నిర్వహణలో ఇంగ్లండ్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎం భాగస్వామ్యం

సగటున రోజుకు 62 వేల పరీక్షలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి

బ్రిటన్‌ సహకారం మాకు అవసరం.. మీకు ఏ సహకారం కావాలన్నా అందిస్తామన్న జగన్‌

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణకు తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్‌ తాత్కాలిక హైకమిషనర్‌ జాన్‌ థాంప్సన్‌ ప్రశంసించారు. ఏపీలో జరుగుతున్న టెస్టులు, ట్రేసింగ్‌ చర్యలను ఆమె కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి భారత్‌లో బ్రిటిష్‌ తాత్కాలిక హైకమిషనర్‌ జాన్‌ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నివారణ చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాన్‌ థాంప్సన్‌ ఏమన్నారంటే..

► ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.
► కరోనా మరణాలు అదుపులో ఉండడం అభినందనీయం. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటోంది. 
► ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కోవిడ్‌ నివారణ కోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. 
► ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) భాగస్వామ్యం 108, 104 లాంటి అంబులెన్స్‌ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలకు దారితీస్తుంది. కాగా, కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్‌ రావాల్సిందిగా సీఎం జగన్‌ను బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఆహ్వానించారు. 

సగటున రోజుకు 62వేల పరీక్షలు చేస్తున్నాం : సీఎం జగన్‌
► రాష్ట్రంలో సగటున రోజుకు 62వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం.
► మరణాలు రేటు దేశం సగటుతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువ. 
► కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. 
► 10వేలకు పైగా రెమిడెసివర్‌ ఇంజక్షన్లతో చాలామందికి మెరుగైన వైద్యాన్ని అందించాం.
► ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం. నాడు–నేడు ద్వారా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. 
► 16 కొత్త మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులు తీసుకువస్తున్నాం. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్‌ నిర్మిస్తున్నాం.
► ఆక్స్‌ఫర్డ్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. 
► బ్రిటన్‌ సహకారం మా రాష్ట్రానికి చాలా అవసరం. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం. 

మరిన్ని వార్తలు