ఆ ఐదేళ్లూ ఉన్నత విద్య పతనం 

22 Sep, 2022 04:11 IST|Sakshi

చంద్రబాబు హయాంలో ఉన్నత విద్యారంగంపై సభకు కాగ్‌ నివేదిక

ఏటా పడిపోయిన వ్యయం.. ఉత్తీర్ణతా శాతాలు.. విశ్వసనీయత లేని మూల్యాంకన విధానం 

మౌలిక వసతులు, సౌకర్యాలు కరువు.. జీఈఆర్‌లో 7 నుంచి 11వ స్థానానికి పతనం  

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఐదేళ్లు ఉన్నత విద్యారంగం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక విశ్లేషించింది. గత సర్కారు ఉన్నత విద్యకు నిధులివ్వకుండా నీరుగార్చినట్లు తేల్చింది. గరిష్ట చేరికల నిష్పత్తి (జీఈఆర్‌)లో రాష్ట్రం 7వ స్థానం నుంచి ఏకంగా 11వ స్థానానికి పతనమైంది. 2014–19 మధ్య ఉన్నత విద్యారంగం పరిస్థితిపై కాగ్‌ రూపొందించిన నివేదికను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ నాలెడ్జ్‌ మిషన్‌ పేరిట 2022 నాటికి ఉన్నత విద్యలో పెట్టుబడిని జీఎస్‌డీపీలో 1.5 శాతం, 2029 నాటికి 2.5 శాతానికి పెంచనున్నట్లు గత సర్కారు పేర్కొంది. అయితే ఉన్నత విద్యపై ఖర్చు 2014 – 15లో జీఎస్‌డీపీలో 0.47 శాతం కాగా 2018–19లో 0.25 శాతానికి దిగజారినట్లు కాగ్‌ తెలిపింది. రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్షా అభియాన్‌ (రూసా) మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యామండలి వార్షిక ప్రణాళికలను కూడా సిద్ధం చేయలేదని పేర్కొంది. కాగ్‌ నివేదికలో ఇతర ముఖ్యాంశాలు ఇవీ.. 

► రాష్ట్ర స్థాయి నాణ్యతా హామీ కమిటీ నిబంధనల ప్రకారం వంద శాతం కాలేజీలు న్యాక్‌ గుర్తింపు పొందాల్సి ఉండగా 2018–19 నాటికి కేవలం 7 శాతం కాలేజీలు మాత్రమే సాధించాయి. చాలా కాలేజీల్లో నిబంధనల ప్రకారం భవనాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఆటస్థలాలు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. అధ్యాపకుల్లో మాస్టర్‌ స్థాయిలో 55 శాతం మార్కులు సాధించిన వారే ఉన్నారు. పీహెచ్‌డీ, నెట్, స్లెట్‌ అర్హతలకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి తేలేదు.  

► తనిఖీలు చేసిన కాలేజీల్లో కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సౌకర్యాలు లేవు. కొన్నిచోట్ల విద్యాబోధనకు తగిన భవనాలు లేవు. చాలా ప్రైవేట్‌ కాలేజీలు మౌలిక సదుపాయాలను  కల్పించడం లేదు. అధ్యాపకులకు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించలేదు.  

► కొన్ని వర్సిటీల పరిధిలో సంప్రదాయ కోర్సులు మినహా కొత్త కోర్సులు లేకపోవడంతో విద్యార్ధులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఏయూ కొత్తగా పీజీ, యూజీ కోర్సులను, ఎస్వీయూ యూజీ కోర్సులను ప్రవేశపెట్టలేదు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది.  

► పలు కాలేజీలు ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలకు విరుద్ధంగా పదేళ్లకుపైగా తాత్కాలిక అనుబంధంతో కొనసాగుతున్నాయి. కేవలం 12 శాతం మాత్రమే శాశ్వత అఫిలియేషన్‌ కలిగి ఉన్నాయి. 

► నిబంధనల ప్రకారం ప్రతి త్రైమాసికంంలో కనీసం ఒక్కసారైనా ఉన్నత విద్యామండలి పాలకవర్గం సమావేశం కావాల్సి ఉండగా 2016 జూలై నుంచి 2018 మధ్య కేవలం ఐదుసార్లు మాత్రమే సమావేశమైంది. యూనివర్సిటీల్లో తాత్కాలిక, ఒప్పంద అధ్యాపకుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి జరిగింది. రెగ్యులర్‌ ఉద్యోగులతో పోలిస్తే ఏయూలో 26 శాతం, ఎస్వీయూలో 55 శాతం, నన్నయలో 83 శాతం తాత్కాలిక ఉద్యోగుల నియామకం చేపట్టారు.  

► డిగ్రీ కాలేజీల ఏర్పాటులో కూడా జిల్లాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. అవసరమైన చోట విద్యార్ధులకు డిగ్రీ కాలేజీలు అందుబాటులో లేవు. 

► ఆంధ్ర, నన్నయ తదితర వర్సిటీల పరిధిలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్ధుల సంఖ్య ఆశాజనకంగా లేదు. 2014–15లో పోలిస్తే 2018లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. సమాధాన పత్రాల మూల్యాంకన విధానం కూడా విశ్వసనీయంగా లేదు. తొలుత పరీక్షల్లో తప్పినట్లు ప్రకటించిన చాలా మంది పునర్‌ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించారు. ఎస్వీయూ పరిధిలోని ఏడు కాలేజీల్లో ఒక కళాశాల డేటా పరిశీలించగా 655 మంది విద్యార్ధులలో కేవలం 9 మంది మాత్రమే పై చదువులకు వెళ్లగలిగారు. ఐసీటీ వినియోగం 28 శాతం కన్నా తక్కువగా ఉండటంతో ఆధునిక పరి/ê్ఙనం విద్యార్థులకు అందడం లేదు.   

మరిన్ని వార్తలు