Bureau Of Energy Efficiency: ఇంధన సంరక్షణలో ఏపీ భేష్‌

27 Dec, 2021 08:42 IST|Sakshi

ఏపీలాగే ఇతర రాష్ట్రాలు

ఇంధన సామర్థ్య పెట్టుబడులపై దృష్టి పెట్టాలి

దేశంలో ఇంధన పొదుపు పెట్టుబడి అంచనా రూ. 10.02 లక్షల కోట్లు

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రే

సాక్షి, అమరావతి: ఇంధన సంరక్షణ కార్యక్రమాల అమలుకు ఏపీ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రే ప్రశంసించారు. అన్ని స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీలతో (ఎస్డీఏ) ఆదివారం జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంధన సంరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14 నుంచి 20 వరకు జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంధన శాఖను ఆయన అభినందించారు.

చదవండి: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ

దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం 2031 నాటికి దాదాపు రూ. 10.02 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భాక్రే తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇంధన సామర్థ్యం, దాని ప్రయోజనాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.

ఏపీలో రూ. 2,185 కోట్ల ఇంధన మిగులు  
పారిశ్రామిక రంగంలో ఇంధన పొదుపు సామర్థ్యం రూ. 5.15 లక్షల కోట్లుగా అంచనా వేయగా, రవాణా రంగంలో రూ. 2.26 లక్షల కోట్లు, గృహ రంగంలో రూ. 1.2 లక్షల కోట్లు ఉందని డీజీ వివరించారు. పెర్ఫార్మ్‌ అచీవ్‌ ట్రేడ్‌ పథకం (సైకిల్‌–1–2) అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగం దాదాపు రూ. 40,945 కోట్ల విలువైన 21.95 మిలియన్‌ టన్నుల చమురును ఆదా చేసిందన్నారు.

ఏపీలో 30 పరిశ్రమల్లో రూ. 2,185 కోట్ల విలువైన ఇంధనాన్ని మిగల్చడం శుభ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 2020–21 నుంచి 2024 –25 వరకు రూ. 4,200 కోట్ల అంచనా వ్యయంతో అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు డీజీ వెల్లడించారు. దీనివల్ల 2030 నాటికి సంవత్సరానికి 557 మిలియన్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీఈఈ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్, డైరెక్టర్లు మిలింద్‌ డియోర్, సునీల్‌ ఖండరే, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు