10, 11 తేదీల్లో గాలులు, వానలు

8 Nov, 2022 05:25 IST|Sakshi

 కొన్నిచోట్ల భారీ వర్షాలకు అవకాశం

సాక్షి, విశాఖపట్నం: మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వానలు మొదలుకానున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం (రేపు) అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ వర్షాలు మరింత  ఊపందుకోనున్నాయి. ఈ అల్పపీడనం వాయవ్యదిశగా తమిళనాడు, పుదుచ్చేరిల వైపు పయనించనుంది.

దీని ప్రభావంతో బుధవారం ఒకటిరెండు చోట్ల తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని, ఈనెల 10వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది.

11వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వీచే ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. సోమవారం విజయనగరం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అనంతపురం జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి.   

మరిన్ని వార్తలు