Andhra Pradesh: 20న అల్పపీడనం! 

19 Oct, 2023 05:00 IST|Sakshi

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం 

23 నుంచి రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం 

ఆపై ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూలం

సాక్షి, విశాఖపట్నం:  అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 20 నాటికి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడుతుందని భార­త వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం నివేదికలో వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఈనెల 23 నుంచి రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ మచిలీపట్నం, కర్నూలు మీదుగా పయనిస్తున్నది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా ని్రష్కమించే పరిస్థితులున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరించుకున్న వెనువెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

ఇందుకు బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం వంటివి ఏర్పడితే మరింత అనుకూలతకు దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని చెబుతున్నారు. అనంతరం రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వీరు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు