విత్తన సేకరణలో దళారులకు చెక్‌

21 Apr, 2021 04:53 IST|Sakshi

నేరుగా రైతుల నుంచే కొనుగోలుకు శ్రీకారం

ఈ–క్రాప్‌లో నమోదు ప్రామాణికంగా సేకరణ

ఏ గ్రామానికి అవసరమైన విత్తనం ఆ గ్రామంలోనే సేకరణ

విత్తన సేకరణ వివరాలు ఆర్‌బీకేల్లో ప్రదర్శన

వేరుశనగ విత్తన సేకరణలో ప్రయోగాత్మకంగా అమలు

ఖరీఫ్‌లో 4.91లక్షల క్వింటాళ్ల విత్తనం సేకరణ లక్ష్యం

ఇప్పటికే 2.02లక్షల టన్నుల విత్తనాలు సేకరణ

సాక్షి, అమరావతి: నాణ్యమైన విత్తన సేకరణలో దళారులకు చెక్‌పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విత్తనోత్పత్తి చేసే రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులపై ఉక్కుపాదం మోపనుంది. విత్తనాలను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేయాలని, ఏ గ్రామంలో అవసరమైన విత్తనాన్ని ఆ గ్రామంలోనే సేకరించాలని నిర్ణయించింది. ఖరీఫ్‌లో 7.03 లక్షల హెక్టార్లు, రబీలో 82,605 హెక్టార్లలో వేరుశనగ, రబీలో 4.60 లక్షల హెక్టార్లలో శనగ సాగవుతాయి. సీజన్‌కు ముందే పరీక్షించిన నాణ్యమైన విత్తనాన్ని ఆర్‌బీకేల ద్వారా రైతుకు అందించాలన్న ప్రభుత్వాశయానికి అనుగుణంగా శనగ, వేరుశనగ సొంత విత్తనోత్పత్తిపై దృష్టిపెట్టిన వ్యవసాయశాఖ విత్తన సేకరణలో కూడా రైతుకు మేలు చేకూర్చేలా పలు సంస్కరణలు తీసుకొచ్చింది. సాధారణంగా 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం ప్రస్తుత రబీ సీజన్‌లో ఆయా జిల్లాల్లో గుర్తించిన రైతులకు గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూలవిత్తనాన్ని ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో 39 వేల ఎకరాల్లో వేరుశనగ, 4,687 ఎకరాల్లో శనగ విత్తనోత్పత్తి చేస్తున్నారు. 

నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ
సాధారణంగా రైతుల ముసుగులో దళారులు ప్రభుత్వ విత్తనసంస్థలకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఉదాహరణకు వేరుశనగ విత్తనానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6,500 ఇస్తుంది. అయితే ప్రభుత్వానికి అమ్మితే డబ్బులెప్పుడో వస్తాయంటూ రైతులను మభ్యపెట్టి వారి నుంచి రూ.5,500 నుంచి రూ.6 వేలకే దళారులు కొనుగోలు చేస్తారు. రూ.500 నుంచి రూ.1000 మార్జిన్‌తో రైతుల పాత పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల ద్వారా విత్తనసంస్థలకు అమ్మి సొమ్ము చేసుకుంటా రు. ఈ తంతుకు చెక్‌ పెట్టాలని, ప్రభుత్వం చెల్లించే ప్రతి రూపాయి నేరుగా రైతుకే చేరాలన్న సంక ల్పంతో విత్తనోత్పత్తి చేసేవారినుంచే కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఈ–క్రాప్‌లో నమో దు తప్పనిసరి చేశారు.

ఈ క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే విత్తనాన్ని సేకరిస్తున్నారు. ఏ గ్రామానికి అవసరమైన విత్తనాన్ని ఆ గ్రామంలోని రైతుల నుం చే తీసుకుంటున్నారు. ఎవరి వద్ద ఎంత విత్తనం కొన్నాం, ఎంత చెల్లించాం.. వంటి వివరాల ను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్‌బీకేలో ప్రద ర్శిస్తున్నారు. నేరుగా వారి ఖాతాలకే సొమ్ము జమచే సేలా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో 4,91,421 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, ఇప్ప టికే 2,02,571 క్వింటాళ్ల విత్తనాన్ని సేకరించారు. మిగిలిన విత్తనాన్ని ఈ నెలాఖరుకల్లా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా సేకరించిన విత్తనా న్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లలో పరీక్షించి సాగుకు ముందే ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచనున్నారు.

రైతులకు మేలు చేయాలనే..
విత్తనోత్పత్తి చేసే రైతులకు మేలు చేయాలనే విత్తన సేకరణలో మార్పులు తీసుకొచ్చాం. గతంలో ఎవరి దగ్గర పడితే వారి దగ్గర విత్తనం సేకరించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్‌ పెడుతూ విత్తనోత్పత్తి చేసే రైతు నుంచే నేరుగా సేకరిస్తున్నాం. ప్రతి పైసా వారి ఖాతాకే జమ చేస్తున్నాం. వారి పేర్లను ఆర్‌బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. ఈ విధానం వల్ల దళారులకు చెక్‌ పడింది. విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. మార్కెట్‌లో పోటీపెరగడంతో ప్రైవేటు విత్తన కంపెనీలు కూడా తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం అందించే అవకాశం ఏర్పడుతుంది.    
– హెచ్‌.అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయశాఖ  

మరిన్ని వార్తలు