పడిపోతున్న 'గుడ్డు'

31 Oct, 2021 03:17 IST|Sakshi

సెప్టెంబర్‌లో వంద కోడిగుడ్ల ధర రూ.441

నెల రోజుల్లో రూ.392కు పడిపోయిన ధర

ఒడిశా, బెంగాల్‌లో పెరిగిన ఉత్పత్తి.. తగ్గిన వినియోగం

దీంతో ఏపీ ఎగుమతులపై తీవ్ర ప్రభావం 

సాక్షి, అమరావతి బ్యూరో: కోడి గుడ్ల ధరలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. నెల రోజుల్లోనే వంద కోడిగుడ్ల ధర దాదాపు రూ.50 మేర పడిపోయింది. రాష్ట్రంలో రోజుకు సగటున ఐదు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల నుంచి మరో కోటి గుడ్లు ఏపీకి దిగుమతి అవుతాయి. వీటిలో 2.50 కోట్ల గుడ్లను ఏపీ నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.

రాష్ట్రంలో స్థానికంగా 3.50 కోట్ల గుడ్లను వినియోగిస్తుంటారు. సాధారణంగా వాతావరణ ప్రభావంతో సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు కోడిగుడ్ల వినియోగం పెరుగుతుంటుంది. దీంతో గుడ్ల ధర కూడా పైకి ఎగబాకుతుంది. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా గుడ్ల ధర క్షీణిస్తుండడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో సెప్టెంబర్‌ 25న వంద గుడ్ల ధర రూ.441గా ఉండగా 30వ తేదీ నాటికి రూ.456కి చేరింది. అప్పటి నుంచి ధర క్రమంగా కిందకి పడిపోవడం మొదలైంది. ఈనెల 5వ తేదీ నాటికి రూ.431కి పడిపోయిన ధర.. 25వ తేదీకల్లా రూ.392కి క్షీణించింది.  

ఒడిశా, బెంగాల్‌ ఎఫెక్ట్‌..  
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఆశ్వయుజ పౌర్ణమి నుంచి మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం బాగా తగ్గిపోయింది. అదే సమయంలో అక్కడ గుడ్ల ఉత్పత్తి మాత్రం పెరిగిపోయింది. ఫలితంగా ఆయా రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు గుడ్లను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎగుమతి చేసే గుడ్లకు పోటీ ఏర్పడి.. ధర భారీగా పడిపోయింది.  

గత ఏడాది ధర వెరీ గుడ్‌..
గతేడాది ఇదే సమయానికి వంద గుడ్ల ధర రూ.500కి పైగా ఉంది. ప్రస్తుత సీజన్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాదితో పోలిస్తే వంద గుడ్ల ధర రూ.100కు పైగానే దిగజారిందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. వంద గుడ్ల ధర రూ.470కి పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ(నెక్‌) జోనల్‌ చైర్మన్‌ కుటుంబరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు