గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్‌ ఆత్మీయ వీడ్కోలు

22 Feb, 2023 08:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనం గవర్నర్‌ స్వీకరించారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన బిశ్వభూషణ్‌.. మూడున్నరేళ్ల పాటు ఏపీ గవర్నర్‌గా కొనసాగారు.

వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

కాగా, హరి­చంద­న్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌.. గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకమని బిశ్వభూషణ్‌ ప్రశంసించారు. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను  అందిస్తుండటం నిజంగా అబ్బురమన్నారు.

వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారని గవర్నర్‌ అన్నారు.

నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్‌..
నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో నూతన గవర్నర్‌కు సీఎం జగన్‌ స్వాగతం పలకనున్నారు. ఎల్లుండి ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.
చదవండి: సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన

మరిన్ని వార్తలు