CM YS Jagan: కుప్పం అంటే చంద్రబాబు పాలన కాదు.. ఇప్పుడు అభివృద్ధి

23 Sep, 2022 13:20 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: కుప్పం అంటే ఇవాళ చంద్రబాబు పాలన కాదు. నా అక్కచెల్లెమ్మల అభివృద్ది. నా అనుకుంటున్న అన్ని వర్గాల ఇంట అభివృద్ధి. అది ఇక్కడి చిరునవ్వులోనే కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుప్పంలోని అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ చేయూత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడి బహిరంగ సభ నుంచి ప్రసంగించారు. 

మరో మంచి కార్యక్రమాన్ని కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. నా పేద ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా పేద అక్కచెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. కుటుంబాన్ని బాధ్యతతో మోస్తున్నవాళ్లకు అండగా ఉండేందుకు అమలు చేస్తున్న కార్యక్రమని సీఎం జగన్‌ గుర్తు చేశారు. చేయూతతో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పు అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అంతేకాదు.. వారం రోజుల చేయూత ఉత్సవాలు కుప్పం నుంచి ప్రారంభం అవుతాయని సీఎం జగన్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులు వచ్చి.. అక్కాచెల్లెమ్మల సంతోషంలో భాగస్వాములవుతారని అన్నారు.

ఇక ఇదే వేదిక నుంచి ఏపీలో జనవరి నుంచి పెన్షన్‌ రూ.2,750కి పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. అలాగే.. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు మూడు వేల రూపాయలు వరకు పెన్షన్‌ ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరస్తామని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కూడా 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తున్నామని, ఈ ఏడాదికిగానూ అక్కాచెల్లెమ్మల కోసం రూ.4,949 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు.

ఒక్క చేయూత ద్వారానే మూడేళ్లలో రూ.14,110 కోట్ల సాయం అందించామని, అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్‌ తెలియజేశారు. అలాగే ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ.12,758 కోట్లు ఇచ్చినట్లు, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడా పారదర్శకతా, వివక్ష లేకుండా.. బటన్‌ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతున్నాయని ఆయన అన్నారు. గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా గమనించాలని, ఒక్కసారి ఆలోచించమని ప్రతీ అక్కాచెల్లెమ్మను కోరారు సీఎం జగన్‌. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించాలనే స్వేచ్ఛను అక్కాచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టామని, అది ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలని, అవసరమైన సాంకేతికత ప్రభుత్వం తరపున అందిస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్‌.

మరిన్ని వార్తలు