సైన్యం సన్నద్ధం

14 Feb, 2023 05:17 IST|Sakshi

1.65 కోట్ల గృహాలను సందర్శించేలా 5.65 లక్షల మందికి శిక్షణ.. 387 మండలాల్లో తొలి బ్యాచ్‌కి ఇప్పటికే పూర్తి.. నేటి నుంచి రెండో బ్యాచ్‌కు.. 

గత సర్కార్‌ కన్నా 45 నెలలుగా అందించిన మెరుగైన పాలనను వివరించాలి

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికీ తెలియ చేయాలి.. గృహాల సందర్శనకు వలంటీర్ల సహకారాన్ని కూడా తీసుకోవాలి

మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ నిర్వహణపై సమీక్ష

కొంత మంది వెనుకబడ్డారు.. వారిలో స్పీడ్‌ పెరగాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 45 నెలలుగా అందిస్తున్న మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గడపకూ విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయ­కర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మార్చి 18వతేదీ నుంచి 26 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ ద్వారా సచివాలయాల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్లు, గృహ సారథులు గడప గడపకూ వెళ్లాలని నిర్దేశించారు.

సచివాలయాల పార్టీ కన్వీనర్లు, గృహ సారథులతో కూడిన 5.65 లక్షల మంది వైఎస్సార్‌ సీపీ సైన్యం క్షేత్రస్థాయిలో సిద్ధమైందన్నారు. ఈ సైన్యం 1.65 కోట్ల గృహాలను సందర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి వలంటీర్ల సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహణపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఈ కార్యక్రమం కూడా అత్యంత కీలకమని, నిర్దేశించుకున్న విధంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

► 16 లోగా మిగిలిన నియామకాలు..
– 93 శాతం గృహ సారథుల నియామకం పూర్తైంది. దాదాపు 5 లక్షల మంది గృహ సారథులను నియమించుకున్నాం. అక్కడక్కడా మిగిలిపోయిన గృహ సారథుల నియామకాలను ఫిబ్రవరి 16 లోగా పూర్తి చేయాలి. పార్టీ కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహ సారథులు చాలా ముఖ్యం.
– గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌ శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్‌కు శిక్షణ మిగిలిన మండలాల్లో రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 19 వరకు కొనసాగుతుంది.
– మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. శిక్షణ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. 
– సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల రూపంలో వైఎస్సార్‌ సీపీకి సుమారు 5.65 లక్షల మందితో కూడిన పార్టీ సైన్యం క్షేత్రస్థాయిలో ఉంది. వీరంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1.65  కోట్ల గృహాలను సందర్శిస్తారు. 
గత సర్కారు కంటే మనం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తారు. 
– ఈ కార్యక్రమంలో గృహ సారథులను సమన్వయం (కో–ఆర్డినేట్‌) చేసే బాధ్యతను సచివాలయ పార్టీ కన్వీనర్లకు అప్పగించాలి. 

గడప గడపకూ అత్యంత కీలకం..
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అత్యంత కీలకం. ఇప్పటివరకూ దాదాపు 7,447 సచివాలయాల్లో గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాం. సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించారు. కొంత మంది మాత్రం పర్యటనలో వెనుకబడ్డారు. తక్కువ గృహాలను సందర్శించారు. అలసత్వం వద్దు. ఆశించిన మేరకు చురుగ్గా ఉంటూ గడప గడపలో విస్తృతంగా పాల్గొనాలి. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరినీ పలకరించి వారితో కొంత సమయం గడపాలి.

దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టండి..
సుమారు 14 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. టీడీపీ, ఆ పార్టీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వాటితో యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చూపిస్తూ అవి ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి. ఆ దుష్ఫ్రచారాన్ని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమష్టిగా గెలుద్దాం
– ఐదు గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీలపై సీఎం జగన్‌ దిశానిర్దేశం
పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు 
కలసికట్టుగా కృషి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. సమన్వయంతో పని చేసి విజయం సాధించాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎస్‌.సుధాకర్, తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి,  పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వెన్నపూస రవీంద్రనాథ్‌రెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్ధానానికి ఎం.వి.రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు