పోలవరం తాజా అంచనాలు ఆమోదించాలి

31 Mar, 2023 04:10 IST|Sakshi
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం జగన్‌

అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి.. ఏపీకి రావాల్సిన బకాయిలు విడుదల చేయండి

రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ రూ.36,625 కోట్లు ఇవ్వాలి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం జగన్‌ వినతి

సాక్షి, న్యూఢిల్లీ: టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు రూ.55,548 కోట్లకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. పోలవరం ప్రాజె­క్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్ల­డా­నికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చిన ఆయన గురువారం ఉదయం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు.  

ఈ సందర్భంగా రాష్ట్రానికి అందాల్సిన నిధులు, బకాయిల అంశాలతో పాటు ప్రత్యేక హోదా అంశాలపై సుమారు అర గంట పాటు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2,020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, ఈ నిధులనూ వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2600.74 కోట్లను సత్వరమే రీయింబర్స్‌ చేయాలన్నారు. సీఎం జగన్‌ ఇంకా ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి. 

► రుణాల విషయంలో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు సరికాదు. వీటి విషయంలో పునరాలోచన చేయాలి. ప్రస్తుత ప్రభుత్వ తప్పు లేకున్నా, రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లకు కుదించారు. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

► ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు వెంటనే మంజూరు చేయాలి.

► 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. ఈ డబ్బును వెంటనే ఇప్పించాలి.

► 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్లు పెండింగులో ఉన్నాయి. వీటిని విడుదల చేయాలి. 

► రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. ఈ దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 

తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్‌
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని గురువారం తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసేందుకు ఈ నెల 29న మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. బుధవారం రాత్రి అమిత్‌షాను కలిశారు. గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు.  

మరిన్ని వార్తలు