అమిత్‌ షాతో ముగిసిన సీఎం జగన్‌‌ భేటీ

15 Dec, 2020 22:49 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సుమారు గంటకుపైగా సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద సాయం చేయాలని కేంద్రమంత్రిని సీఎం జగన్‌ కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనాలను అమోదించేలా సహకరించాలని విన్నవించారు. రెండవ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్‌ (2వ ఆర్‌సీఈ) ప్రకారం 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే రూ, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్ ఉన్నారు.‌ మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు.

అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి...
అమిత్‌ షాతో భేటీ సందర్భంగా సీఎం జగన్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అధికార వికేంద్రీకరణ, ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక వేసుకున్నామని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసనరాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని చేస్తూ ఆగస్టులో చట్టంకూడా చేశామని ఈ సందర్భంగా అమిత్‌ షాకు గుర్తుచేశారు. హైకోర్టును కర్నూలుకు రీ లొకేట్‌ చేసేలా ప్రక్రియ ఆరంభించాలని, దీనికోసం నోటిఫికేషన్‌ జారీచేయాలని కోరారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశం ఉందని ప్రస్తావించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

పెండింగ్‌ నిధులు విడుదల..
సమగ్ర భూ సర్వేకోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్‌ టైటలింగ్‌ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. డిసెంబర్‌ 21న సమగ్ర సర్వే ప్రారంభమవుతుందన్న విషయాన్ని వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించడానికి తీసుకొచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులకు వెంటనే ఆమోదం పొందేలా ప్రక్రియను పూర్తిచేయాలంటూ అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, దీనికోసం ఇప్పటికే అభ్యర్థనలు పంపామని, వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ కాలేజీలు చాలా కీలమని హోంమంత్రికి వివరించారు. ఉపాథిహామీ పథకంలో భాగంగా పెండింగులో ఉన్న రూ.3,801.98 కోట్లను విడుదల చేయాలని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు