Andhra Pradesh: ఆ మూడూ ముఖ్యం

9 Nov, 2021 03:18 IST|Sakshi

నేడు భువనేశ్వర్‌కు సీఎం జగన్‌.. సుదీర్ఘ వివాదాలపై చర్చలతో ముందడుగు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సాయంత్రం ప్రత్యేకంగా భేటీ

ఉభయ రాష్ట్రాల అంశాలపై చర్చించనున్న ఇద్దరు సీఎంలు

నేరడి బ్యారేజీ, జంఝావతి, కొఠియా గ్రామాలపై ప్రధానంగా దృష్టి

జల వివాదాలు సమసిపోతే ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనమే

సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం వెదికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతోపాటు జంఝావతి రిజర్వాయర్‌ ముంపు సమస్యపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. సరిహద్దు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సమస్యలు పరిష్కరించుకుని కలిసి అభివృద్ధి చెందడమే తమ అభిమతమని సీఎం జగన్‌ పలు దఫాలు పేర్కొనటం తెలిసిందే.

ఈ క్రమంలో చర్చలకు సమయమిస్తే తానే వస్తానంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాసి చొరవ చూపారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించారు. ఇద్దరు సీఎంల సమావేశంతో సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ముందడుగు పడుతోంది. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతిపై కాంక్రీట్‌ డ్యామ్, కొఠియా గ్రామాల అంశాలు ఇరువురి సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం. పోలవరం కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనిపై సలహాపూర్వక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఒడిశా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి మూడు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

జంఝావతిపై కాంక్రీట్‌ డ్యామ్‌..
జంఝావతిపై రబ్బర్‌ డ్యామ్‌ స్థానంలో శాశ్వతంగా కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణం అంశాన్ని కూడా సమావేశంలో సీఎం జగన్‌ ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా 24,640 ఎకరాలకుగానూ కేవలం ఐదు వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇవ్వగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించడం వల్ల ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, 6 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయన్నారు. ఒడిశాలో దాదాపు 1,174 ఎకరాల భూమి ముంపునకు గురి కానుండగా ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు  సహకరించాలని ఒడిశా ముఖ్యమంత్రిని సీఎం జగన్‌ కోరనున్నారు. 

ఏపీలోనే ఉంటామని కొఠియా గ్రామాల తీర్మానాలు
కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికారులు తాజాగా సీఎం జగన్‌కు తెలియచేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ సమీర్శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నేడు ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.15 గంటలకు పాతపట్నం చేరుకుని పెళ్లి రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై చర్చిస్తారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా సీఎం జగన్‌ వెంట ఒడిశా పర్యటనలో పాల్గొంటారు. 

నేరడి బ్యారేజీతో ఒడిశాకూ ప్రయోజనం
నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఉభయ రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను సీఎం జగన్‌ చర్చల సందర్భంగా ప్రస్తావించనున్నారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో 103 ఎకరాలు అవసరం కాగా ఇందులో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో సుమారు 
5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు