గ్రీన్‌ ఎనర్జీ కేంద్రంగా.. డేటా సెంటర్‌ హబ్‌గా ఉమ్మడి విశాఖ

9 Feb, 2023 15:49 IST|Sakshi

పూడిమడకలో రూ.1.10 లక్షల కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు  

61 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్న ఎన్‌టీపీసీ

కాపులుప్పాడలో మరో డేటా సెంటర్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

20,450 మందికి ఉపాధి అవకాశాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కీలక ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. ఐటీ హబ్‌గా పర్యాటక డెస్టినీగా భాసిల్లుతున్న వైజాగ్‌.. ఇప్పుడు డేటా సెంటర్‌కు ప్రధాన కేంద్రంగానూ, గ్రీన్‌ ఎనర్జీకి కేరాఫ్‌గా మారనుంది. ఏకంగా 1.10 లక్షల కోట్ల పెట్టుబడితో 61 వేల మందికి ఉపా«ధి కల్పించేలా ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అదేవిధంగా రూ.7,210 కోట్ల పెట్టుబడితో 20 వేల పై చిలుకు ఉద్యోగాలు కల్పించేలా డేటా సెంటర్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఉమ్మడి విశాఖ చరిత్రలో ఒకేసారి రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు, 80 వేలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

కీలక ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖపట్నం మారుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలో పెట్టుబడులకు, భారీ ప్రాజెక్టులకు ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,44,185.07 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. ఇందులో సింహభాగం విశాఖకే చెందినవి కావడం గమనార్హం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా రూ.1,17,210 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో విశాఖ జిల్లా పారిశ్రామిక రంగంలో సరికొత్త విభాగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. 

గ్రీన్‌ ఎనర్జీ కేరాఫ్‌ పూడిమడక 
దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు అచ్యుతాపురం మండలంలోని పూడిమడక చిరునామాగా మారనుంది. ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా లక్షా 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో న్యూ ఎనర్జీ పార్కు నిర్మించనుంది. ఈ పార్కులో గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్, హైడ్రోజన్‌ సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయి. ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కొత్త తరహాలో ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు ప్రణాళికలు తయారు చేసింది. రెండు దశల్లో పూర్తి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 61 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రానున్నాయి. 

ప్రాజెక్టు పేరు : ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ పార్కు 
పెట్టుబడి : రూ.1,10,000 కోట్లు 
విస్తీర్ణం : సుమారు 1000 ఎకరాలు 
ఉపాధి అవకాశాలు : 61 వేల మందికి 
మొదటి దశ : రూ.55 వేల కోట్లు, 30 వేల మందికి ఉపాధి అవకాశాలు 
పూర్తి చేసే సమయం : 2027 
రెండోదశ : రూ.55 వేల కోట్లు, 31 వేల మందికి ఉపాధి అవకాశాలు 
పూర్తి చేసే సమయం : 2033 

కాపులుప్పాడలో డేటా సెంటర్‌ 
మధురవాడ ఐటీ హిల్స్‌ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. రూ.14,634 కోట్ల పెట్టుబడులతో 200 మెగావాట్ల సామర్థ్యంతో డేటాపార్క్‌ రాబోతోంది. తాజాగా 100 మెగావాట్ల సామర్థ్యంతో మరో డేటా సెంటర్‌ దాని సమీపంలోని కాపులుప్పాడ ప్రాంతంలో ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ పచ్చజెండా ఊపింది. వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ డేటా సెంటర్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.7,210 కోట్ల పెట్టుబడులతో 20,450 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాలని సంకల్పించారు. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తయితే విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్‌కు డేటా సెంటర్‌ హబ్‌గా మారనుంది. 

ప్రాజెక్టు పేరు : డేటా సెంటర్‌ 
ఎవరి ఆధ్వర్యంలో : వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ 
పెట్టుబడి : రూ.7,210 కోట్లు 
ఉపాధి అవకాశాలు : 20,450 మందికి 
ప్రత్యక్షంగా : 14,825 మందికి 
పరోక్షంగా ఉపాధి : 5,625 మందికి 
ప్రాజెక్టు పూర్తయ్యేది : 2026 
మొదటి దశలో.. : 10 మెగావాట్లు 
రెండో దశలో : 40 మెగావాట్లు 
మూడో దశలో : 50 మెగావాట్లు

మరిన్ని వార్తలు