రేపటి ఆర్థిక నగరాలపై సమగ్ర చర్చ 

30 Mar, 2023 04:35 IST|Sakshi

మౌలిక సదుపాయాల కల్పన, వనరుల సమీకరణ.. అర్బన్‌లో సేవల విస్తృతం, అవకాశాలపై గురి

ఇప్పటివరకు ఏడు సెషన్లు,ఒక వర్క్‌షాపు నిర్వహణ 

జూన్‌ ఆఖరులో రుషికేష్‌లో మూడో ఐడబ్ల్యూజీ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యం అద్భుతం 

కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌

సాక్షి, విశాఖపట్నం: పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అందుకవసరమైన నిధుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై  జీ–20 దేశాల ప్రతినిధుల బృందం సమగ్రంగా చర్చించింది. జీ–20 దేశాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ మీడియాకు వెల్లడించారు.

రేపటి ఆర్థిక నగరాలు మరింత వృద్ధి చెందేందుకు తీసుకోవలసిన చర్యలు, ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులను పెంచడం వంటి అంశాలపైనా ప్రతినిధులు విస్తృతంగా చర్చించారన్నారు. ఈ సదస్సుకు 14 జీ–20 సభ్యదేశాల నుంచి 57 మంది ప్రతినిధులు, ఎనిమిది మంది ఆహ్వానితులు, పది అంతర్జాతీయ సంస్థల నుంచి మరికొంతమంది ప్రతినిధులు హాజరయ్యారన్నా­రు.

మిగిలిన ఆరు సభ్య దేశాల ప్రతినిధులు ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారని ఆయన చెప్పారు. పట్టణాలు­/­నగరాల్లో మౌలిక సదుపాయాల క­ల్ప­నకు పె­ట్టు­బడులను ప్రోత్సహించ­డం, ఆర్థిక వనరుల కోసం వి­నూత్న మార్గాలను గుర్తించ­డం వంటి వాటిపై చర్చ జరిగిందని తెలిపారు. సమావేశాల్లో భాగంగా ఇప్పటివరకు ఏడు సెషన్లు, ఒక వర్క్‌షాపు నిర్వహించారన్నారు.

అర్బన్‌ ప్రాంతాల్లో మౌలిక వసతులపై..
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల్లో క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (క్యూఐఐ) సూచికలను అన్వేషించడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యయంపై డేటాను క్రోడీకరించడం, ప్రైవేటు రంగానికి ఆ డేటా ఉపయోగపడేలా చేయడంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారని, వీటిపై కొన్ని ప్రెజెంటేషన్లు ఇచ్చారని ఆరోఖ్యరాజ్‌ వివరించారు. అర్బన్‌ ప్రాంతాల్లో మౌ­లి­క సదుపాయాలపై అంతర్జాతీయ సంస్థల రౌండ్‌ టేబుల్‌ సమావేశం కూడా జరిగిందన్నారు.

సుపరిపాలనకు ఏ రకమైన నైపుణ్యం అవసరమవుతుందో నిపుణులు సూచనలు చేశారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో యూఎన్‌డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, ఏడీబీ, ఈబీఆర్‌డీ వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన 13 మంది నిపుణులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. గత జనవరిలో పూణేలో జరి­గిన జీ–20 ఐడబ్ల్యూజీ సదస్సులో చర్చకు వచ్చిన అంశాలపై విశాఖలో బ్లూప్రింట్‌ ఇచ్చామన్నారు. 

బీచ్‌లో యోగా, ధ్యానం.. 
రెండో రోజు బుధవారం ఉదయం సదస్సు నిర్వహిస్తున్న రాడిసన్‌ బ్లూ హోటల్‌ సమీపంలో ఉన్న బీచ్‌లో జీ–20 దేశాల ప్రతినిధులకు యోగా, «ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో నిర్వహించిన కార్యక్రమంలో సాత్విక ఆహారాన్ని పరిచయం చేశారు.  

రుషీకేష్‌లో మూడో సదస్సు..
జూన్‌ ఆఖరులో ఈ జీ–20 మూడో ఐడబ్ల్యూజీ సదస్సు రుషికేష్‌లో జరుగుతుందని ఆరోఖ్యరాజ్‌ వెల్లడించారు. విశాఖ సదస్సులో చర్చించిన అంశాలను పైలట్‌ స్టడీస్‌ కింద అక్కడ సమర్పిస్తారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యం ఎంతో బాగుందని అతిథులు ప్రశంసించారని ఆరోఖ్యరాజ్‌ తెలిపారు.

అంతేకాదు.. సదస్సు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారి మనసు దోచుకున్నాయన్నారు. ముఖ్యంగా విశాఖ నగ­రంలోని తొట్లకొండ, కైలాసగిరి వ్యూపాయింట్, ఆర్కేబీచ్, సీహారియర్‌ మ్యూజియం, వీఎంఆర్‌డీఏ బీచ్‌లు అతిథులను కట్టిపడేశాయని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏపీలో గృహనిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంగళవారం రాత్రి అతిథులకు ఇచ్చిన గాలా డిన్నర్‌­లో వివరించారన్నారు.

నేడు, రేపు ఇలా.. 
ఇక గురువారం జీ–20 దేశాల ప్రతినిధుల కోసం కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాపు జరుగుతుందని ఆరోఖ్య­రాజ్‌ చెప్పారు. కొరియా, సింగపూర్‌లకు చెందిన నిపుణులు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్సింగ్‌లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపైన, పట్టణ ప్రాంతాల్లో నా­ణ్యమైన జీవన విధానంపైన చర్చిస్తారన్నారు. విశాఖ నగరంపై కూడా ఈ సమావేశంలో ప్రెజెంటేషన్‌ ఉంటుందని తెలిపారు. అలాగే, శుక్రవారం జరిగే సమావేశానికి దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు హాజరవుతారని చెప్పారు. 

మరిన్ని వార్తలు