వాయుగుండం కాదు.. వచ్చేది తుపానే

6 Dec, 2022 04:36 IST|Sakshi

నేడు వాయుగుండంగా అల్పపీడనం 

రేపటి నుంచి రాష్ట్రంలో వానలు 

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం అంచనా తప్పి బలపడనుంది. తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడనుంది. కాగా.. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది.

ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. 

దక్షిణ కోస్తా.. రాయలసీమపై అధిక ప్రభావం
ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను.. ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ వివరించింది. వాయుగుండం, తుపాను ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో కోస్తాలో తీరం వెంబడి గంటకు 40నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. 

దీని పేరు ‘మాండూస్‌’
ఈ తుపానుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) సూచించిన ‘మాండూస్‌’ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 

15న మరో అల్పపీడనం
ఈ నెల 15వ తేదీన అండమాన్‌ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఏపీ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో అల్పపీడనాలు ఏపీ తీరంవైపు కదలడం లేదని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు