AP: రాష్ట్రానికి తుపాను ముప్పు

16 Oct, 2022 03:47 IST|Sakshi
తాడికొండలో వాగు దాటుతున్న ఆర్టీసీ బస్సు

సూపర్‌ సైక్లోన్‌గా మారుతుందంటున్న వాతావరణ సంస్థలు 

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో 3 రోజులు వర్షాలు 

శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు 

అష్టదిగ్బంధంలో అమరావతి 

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్‌ సముద్రం, దాని పరిసరాల్లో ఈ నెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 20వ తేదీ నాటికి ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

క్రమంగా ఇది ఏపీ–ఒడిశా తీరం వైపు కదులుతూ 24, 25 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పెను తుపాను (సూపర్‌ సైక్లోన్‌)గా మారుతుందని పలు అంతర్జాతీయ ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. 
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

పలు జిల్లాల్లో భారీ వర్షాలు..  
కాగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. కుంభవృష్టితో కోనసీమ తడిసి ముద్దైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చంపావతి, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది.

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి దిగువకు 4.33 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండ లం ఓలేరు, పల్లెపాలెం, పెదలంక, కాకుల డొంక వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోం ది. కాగా వర్షాల నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ఉధృతితో ప్రవహించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో వాగుల్లో కొట్టుకుపోతున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. 

అష్టదిగ్బంధంలో అమరావతి 
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. గత టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా నిర్మించిన అమరావతిని వాన నీరు చుట్టుముట్టింది. భూసమీకరణ పేరుతో వేలాది ఎకరాలు సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంతంలో అందుకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించకపోవడంతో సచివాలయ ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బందిపడ్డారు. 

మరిన్ని వార్తలు