‘అనంత’కు అగ్రతాంబూలం 

10 Oct, 2022 08:24 IST|Sakshi

అనంతపురం కల్చరల్‌: హైందవ సంప్రదాయంలో ఆలయానికి, అందులో పనిచేసే అర్చకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు వైభవంగా సాగిన అర్చక పురోహిత వ్యవస్థ కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఆర్థిక వనరులు అందక కుదేలవుతూ వచ్చింది. దీంతో చాలా అర్చక కుటుంబాలు వృత్తిని వదిలేసి ప్రత్యమ్నాయ మార్గాల్లో స్థిరపడిపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అర్చకులకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు.

ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్‌) సమర్పించేందుకు వీలుగా కొత్తగా పథకాన్ని తీసుకువచ్చారు. దీంతో ఆలయాలకు కొత్త శోభ చేకూరింది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి ఆలయ వ్యవస్థ చతికిలబడింది. 2019 తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ఆలయాలకు పునః వైభవం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆలయాలను డీడీఎన్‌ఎస్‌ పథకం కిందకు తీసుకువస్తూ తాజాగా జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అత్యధిక ఆలయాలతో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలిచింది.
  
జిల్లాలో ఉరవకొండ టాప్‌.. 
రాష్ట్ర వ్యాప్తంగా డీడీఎన్‌ఎస్‌ పథకం కింద ఇప్పటి వరకూ 2,747 ఆలయాలు ఉండేవి. జగన్‌ సర్కార్‌ తాజా నిర్ణయంతో 4,367 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో అనంత జిల్లాలో 218 ఆలయాలు ఈ పథకం కింద ఉండేవి. తాజాగా 71 ఆలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావడంతో వీటి సంఖ్య 289కు చేరుకుంది. ఇందులోనూ ఉరవకొండ నియోజకవర్గం 75 ఆలయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో 69 ఆలయాలతో తాడిపత్రి నియోజకవర్గం ఉంది.  

ఆలయానికి రూ.5 వేలు.. 
ఈ పథకం ద్వారా ప్రతి ఆలయానికి ధూప, దీప, నైవేద్యం ఖర్చులకు రూ. 2వేలు, పూజారి గౌరవ వేతనం కింద మరో రూ.3వేలు చొప్పున నెలకు రూ.5వేలను ప్రభుత్వం అందజేస్తుంది. ఆలయ పూజారి బ్యాంక్‌ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో  ఏడాదికి రూ. 30 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు లేదా రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూమి, ఐదెకరాల లోపు మెట్ట భూమి ఉంటేనే  డీడీఎన్‌ఎస్‌ పథకం వర్తిస్తుంది.   

సంతోషంగా ఉంది 
దశాబ్ధానికి పైగా ఆ భగవంతుణ్ని నమ్ముకుని పూజలు చేస్తున్నా. గత ప్రభుత్వ పెద్దలకు మా దుస్థితి విన్నవించుకున్నా ఎలాంటి  ప్రయోజనం లేకపోయింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. చిన్నపాటి ఆలయాలకు సైతం గుర్తింపునిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది.  
– చంద్రస్వామి, రామాలయం అర్చకుడు, ముచ్చుకోట

289 ఆలయాలకు వర్తింపజేశారు 
డీడీఎన్‌ఎస్‌ పథకంలో గతంలో కేవలం 129 ఆలయాలు మాత్రమే ఉండేవి.  చాలా మంది అర్చకులు విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మేము పంపిన ప్రతిపాదనల్లో 306 ఆలయాలు ఉండగా ఇందులో అన్ని విధాలుగా అర్హత ఉన్న 289 ఆలయాలకు పథకాన్ని వర్తింపజేశారు.   
 – రామాంజనేయులు, ఏసీ, దేవదాయ ధర్మదాయశాఖ

మరిన్ని వార్తలు