కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి 

15 Sep, 2022 06:40 IST|Sakshi
మాట్లాడుతున్న బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణ తదితరులు

అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి 

కర్నూలు న్యాయవాదుల డిమాండ్‌  

కర్నూలు (లీగల్‌): రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించి సీమ ప్రజల చిరకాల వాంఛను తీర్చాలని కర్నూలు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు.

కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.ఆర్‌.కృష్ణ, సీమ న్యాయవాదుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ వై.జయరాజు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్‌ న్యాయవాదులు ఓంకార్, నాగలక్ష్మీదేవి, ఎం.సుబ్బయ్య, పి.సువర్ణరెడ్డి, బి.చంద్రుడు, రాజేష్, రంగనాథ్‌ మాట్లాడారు.

హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చరిత్రాత్మక అవసరమే కాకుండా మూడుప్రాంతాల సమతుల్యానికి   దోహదం చేస్తుందన్నారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధానులతో సంబంధం లేకుండా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు, ప్రతిపక్ష నేతకు, సీమప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు.   

మరిన్ని వార్తలు