‘బాల నేరస్థులతో మృదువుగా మెలగాలి’

1 Oct, 2020 10:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జువనైల్‌ జస్టిస్‌ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి వర్క్‌ షాపులో జూమ్‌ యాప్‌ ద్వారా హైకోర్టు చీఫ్‌ జస్టిస్ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ వెబినార్‌ ద్వారా పాల్గొని పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్‌ ఇవ్వాలనే అంశాలపై చర్చించేందుకే ఈ వర్క్‌ షాపు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఒంటరి, సంరక్షణ లేని బాలురు, బాలికలు తారసపడితే ముందుగా పోలీసులకు తెలపాలని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒంటరి బాలురు, బాలికల వివరాలను పోలీసులకు తెలియపరచాలని సూచించారు. ఇందుకోసం www.trackthemissingchild.gov.in వెబ్‌సైట్‌ ద్వారా వారి వివరాలు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా వచ్చిన వివరాలు తప్పి పోయినప్పటికి.. వారి వివరాలతో సరిపోలితే సదరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని చెప్పారు. ఒంటరి బాలురు, బాలికలను కొట్టడం దుర్బాషలాడటం చేయకూడదని.. పిల్లలు నేరం చేస్తే వారిని స్టేషన్‌లోనే నేరస్థులతో కూర్చోబెట్టకుండా మృదువుగా వ్యవహరించాలని డీజీపీ పేర్కొన్నారు.

చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మాట్లాడుతూ.. పిల్లలు దేశ భవిష్యత్తుకు ముఖ్యమైన మూలధనం అన్నారు. వారి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఏపీజె అబ్దుల్ కలామ్ కూడా అనాధ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడారని గుర్తు చేశారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ అనాథ పిల్లల భవితవ్యంపై దృష్టి సారించాలని, జువనైల్ జస్టిస్ ప్రకారం నేరం ఆరోపించబడిన పిల్లలు, పట్టించుకొనే వారు లేని పిల్లలుగా వర్గీకరించారని తెలిపారు. అందరూ కూడా పిల్లల భవిష్యత్తు విషయంలో ఒక బాధ్యత కలిగి‌ ఉండాలని, నేరం ఆరోపించబడిన పిల్లలు నేరస్ధులు కాదని ఆయన అన్నారు. వాళ్లు బాధితులని, నేరం ఆరోపించబడిన పిల్లలతో మృదువుగా ప్రవర్తించాలని చెప్పారు. అనాథ పిల్లల మానసిక స్ధితిగతులను అర్ధం చేసుకుని వారితో మెలగాలని, వారి దత్తత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనాథ పిల్లలకు పునరావాస కల్పన చాలా జాగ్రత్తగా చేయాలని, ప్రభుత్వాలు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. వారికి కుటుంబ వాతావరణం కల్పించాలని, ఓల్డేజ్ హోమ్‌ల దగ్గరలో జువనైల్ హోంలు కూడా ఉండాలని చెప్పారు. లీగల్ క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీల విధానాలలో ఇంకా మార్పులు రావాలని, సీడబ్ల్యూసీ, ఆరాలలో ఉన్న ఇబ్బందులతో దత్తత చేయడం ఆలస్యం అవుతోందన్నారు. బాధ్యులందరూ కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్‌ జస్టిస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు