స్థలం + ఇల్లు.. రెట్టింపు ఆనందం

4 Jan, 2021 04:45 IST|Sakshi
గుంటూరు జిల్లా మేడికొండూరులో తనకు కేటాయించిన స్థలంలో బిడ్డతో చిరునవ్వు చిందిస్తున్న ఊర్మిళ

లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ 

ఇప్పటికి 2 లక్షల మందికి పైగా అందజేత 

వారంలోగా 15.60 లక్షల మందికి అందేలా చర్యలు

సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి ఇరుకు గదుల్లో.. కాలువ గట్ల వెంబడి.. అద్దె వసారాల్లో.. కాలం గడుపుతున్న లక్షలాదిమంది పేదలకు ఇప్పుడు ఆనందం రెట్టింపయింది. ఈ ఆనందాన్ని తమకిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని.. తమ జీవితకాలం మరచిపోబోమని వారు చెబుతున్నారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత పేదలకు ప్రభుత్వం ఇళ్ల మంజూరు పత్రాలు జారీచేస్తోంది. చేతికి అందిన ఇంటి పట్టాను చూసి సంతోషిస్తున్న సమయంలోనే ఇల్లు మంజూరు పత్రం కూడా చేతుల్లోకి చేరడంతో సొంతింటి కల త్వరలో నెరవేరుతుందని వారు సంతోషిస్తున్నారు.

రాష్ట్రంలో పేదలకు మొదటి విడత 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు రెండులక్షల మందికిపైగా లబ్ధిదారులకు గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల మంజూరు పత్రాలు జారీచేశారు. ఇల్లు మంజూరైనవారందరికీ పట్టా అందిన వారంలోగా ఇంటి మంజూరు పత్రం ఇచ్చేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించి అవగాహన కోసం ప్రతి లబ్ధిదారు పేరిట ప్రత్యేకంగా పాస్‌పుస్తకాన్ని ముద్రించారు. లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేసేందుకు అందులో టోల్‌ ఫ్రీ నంబరు 1902ను ముద్రించారు.  

పాస్‌ పుస్తకంలో వివరాలు ఇలా.. 
ఇంటి నమూనా, వలంటీర్లు, సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల విధులు, ఇంటి నిర్మాణదశలు, నిర్మాణ సామగ్రి, దశల వారీగా దేనికి ఎంత చెల్లించాలనే వివరాలను పాస్‌పుస్తకంలో ముద్రించారు. ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని దినాలు, ఆయా దశల్లో కూలీలకు ఇచ్చే మొత్తం, తుది మెరుగుల వరకు చెల్లింపుల వివరాలు పొందుపరచారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మార్కెట్‌ ధర కంటే తక్కువకే లబ్ధిదారుల సమ్మతి మేరకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ దశల వారీగా అందజేసే నిర్మాణ సామగ్రి, నగదు వివరాలు లబ్ధిదారుతో ధ్రువీకరించుకుని పాసుపుస్తకంలో నమోదు చేస్తారని తెలిపారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అధికారుల మొబైల్‌ నంబర్లు, లబ్ధిదారుకు తన ఇంటి ప్రస్తుత స్థితి వరకు అందిన నగదు, సామగ్రి తదితర వివరాలు తెలియజేసేందుకు వీలుగా పాస్‌ పుస్తకాన్ని ముద్రించారు.   

మరిన్ని వార్తలు