24న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

17 Oct, 2022 06:00 IST|Sakshi

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్‌ 24వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఉదయం ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, అనంతరం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్‌ 24న కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. 

శ్రీవారి దర్శనానికి 10 గంటలు : 
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు 31 నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,535 మంది స్వామి వారిని దర్శించుకోగా, 37,357 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.08 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

టీటీడీ వైఖానస ఆగమ సలహా మండలి సభ్యుల నియామకం 
తిరుమల శ్రీవారి ఆలయానికి టీటీడీ వైఖానస ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఆలయ అర్చకులు అర్చకం రామకృష్ణ దీక్షితులు, ఎస్వీ ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం, వైఖానస ఆగమ స్మార్త పండితులు ఎన్‌.వి.మోహనరంగాచార్యులు, విశ్రాంత వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, తిరుపతి ఎస్వీ వేదిక్‌ వర్సిటీ, అతిథి ఆచార్యులు, వైఖానస పండితులు వేదాంతం గోపాల కృష్ణమాచార్యులు సభ్యులుగా నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతన ఆగమ సలహా మండలి సభ్యులను శ్రీవిజనస ట్రస్టు కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు అభినందించారు.  

మరిన్ని వార్తలు