ప్రభుత్వ ధరకు కొనాల్సిందే.. నష్ట పరిచే చర్యలు వద్దు

26 Nov, 2022 17:04 IST|Sakshi

రొయ్యల రైతులను నష్టపరిచే పనులు చేయొద్దు

మంచి ధర ఇచ్చి ఎందుకు కొనుగోలు చేయరు

ఇదే కొనసాగితే ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై చర్యలు

15 రోజుల్లో సీఎం శుభవార్త చెబుతారు

మూడు జిల్లాల రొయ్య రైతుల సదస్సులో అప్సడా వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తామన్న రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌ రావు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సీజన్‌లో పండించిన రొయ్యలను రైతుల వద్ద నుంచి ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఒంగోలు నగరంలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతుల సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ ఆక్వా రైతుల సదస్సుకు రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు, ట్రేడర్లను కూడా ఆహ్వానించారు.

ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్‌ దుగ్గినేని గోపీనాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్సడా వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం  మాట్లాడుతూ రొయ్యల రైతులను నష్టపరిచే పనులు ఏ ఒక్కరూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘సాధికార కమిటీలో 100 కౌంటు రొయ్యలకు కిలో రూ.240 నిర్ణయించాం. కానీ 100 కౌంటును రూ.225కు కొనుగోలు చేస్తున్నారు. ధర లేదంటే ప్రభుత్వం ఒక మెట్టు దిగి 100 కౌంటును రూ.210 తగ్గించి నిర్ణయం తీసుకుంది. అయినా ఆ ధరకు కూడా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.

మీకు గిట్టుబాటు కాకపోతే చెప్పండి... 10 ఎకరాలు సాగుచేసే రైతును 5 ఎకరాలు సాగుచేయమంటారా’’ అని నిలదీశారు. అలా చెబితే రైతులు మానసికంగా నిర్ణయించుకుంటారని సలహా కూడా ఇచ్చారు. రైతు వద్ద ఒక కౌంటు రొయ్యలు ఉంటే లేని కౌంటు రొయ్యలను రైతులను అడుగుతున్నారని వారు చెబుతున్నారని..ఇదే విధంగా కొనసాగితే ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విద్యుత్‌ సమస్యతో పాటు రొయ్యల రైతులకు ఉన్న అన్ని సమస్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారని, 15 రోజుల్లో సీఎం రొయ్యల రైతులకు శుభవార్త చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం కన్వీనర్‌ దుగ్గినేని గోపీనా«థ్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన వారిలో జిల్లా ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు మున్నంగి రాజశేఖర్, రైతులు టంగుటూరుకు చెందిన దివి హరిబాబు, కొత్తపట్నంకు చెందిన శ్రీనివాస రావు, నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర నాయుడు, గూడూరుకు చెందిన శ్రీనాథ్‌రెడ్డి, నరేంద్ర, నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకురెడ్డితో పాటు జిల్లా మత్స్యశాఖ జేడీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం 
మన దేశం నుంచి ఈ సంవత్సరం 8.50 లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నాం. ఈక్విడార్‌ దేశంలో 8.85 లక్షల టన్నులు ఎగుమతి చేస్తోంది. వాళ్లకు ఇచ్చే ధర ఇక్కడ ఎందుకు ఇవ్వరు. పలు దేశాల్లో 100 కౌంటుకు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు సాధ్యం కావటం లేదో చెప్పండి. ప్రభుత్వం చొరవ తీసుకొని అందరినీ ఒకచోటకు చేర్చి సదస్సులు నిర్వహిస్తోంది. ఆక్వా రైతు అప్పుల పాలు కాకుండా చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. 
– మోహన రాజు, రొయ్య రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు  

ఈ సీజన్‌లో రైతులను ఆదుకోండి 
ఈ సీజన్‌లో సిద్ధంగా ఉన్న రొయ్యలను కొనుగోలు చేసి ఆదుకోండి. ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలబడింది. ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో జిల్లాల వారీగా ఆక్వా రైతులతో పాటు రొయ్యలను కొనుగోలు చేస్తున్న సంస్థల యజమానులను కూడా సదస్సులకు పిలిపిస్తోంది. ఇది మంచి పరిణామం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా అందరితో కలిపి సంయుక్తంగా సదస్సులు నిర్వహించలేదు.  
– దుగ్గినేని గోపీనా«థ్, ప్రకాశం జిల్లా ఆక్వా రైతు సంఘం కన్వీనర్‌  

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు 
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రొయ్యలను కొనుగోలు చేస్తాం. నేను కూడా 1500 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. సాగులో నేను కూడా నష్టపోతున్నాను. అయితే ఈ సంక్షోభం తాత్కాలికమే. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆక్వా రంగంలో ఎదురవుతున్న సంక్షోభంపై చొరవ చూపుతోంది.గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చొరవ చూపలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులకు అండగా ఉండాలని నిర్ణయించి జిల్లాల వారీగా రైతులు, ఎక్స్‌పోర్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేయటం మంచి పరిణామం. రైతులు కూడా ఖర్చులు తగ్గించుకోవాలి.  
– బీద మస్తాన్‌ రావు, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు  

ఈ రెండు జిల్లాల్లో 50 టన్నులు కొంటాం 
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే రొయ్యలను తాము ఇక నుంచి 50 టన్నులు కొనుగోలు చేస్తాం. సింగరాయకొండ, నెల్లూరు జిల్లాల్లో ఉండే ప్రాసెసింగ్‌ ప్లాంట్లకు ఈ రెండు జిల్లాల నుంచే కొనుగోలు చేస్తాం. బయట జిల్లాల నుంచి ఇక్కడకు తెప్పించేది లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తాం... చేస్తున్నాం. రైతులు చిన్నసైజు రొయ్యల ఉత్పత్తినే లక్ష్యంగా పెట్టుకోవద్దు. మిగతా సంస్థల చేత కూడా కొనుగోలు చేయిస్తాం.  
– బ్రహ్మానందం, ఏపీ ఎక్స్‌పోర్టర్ల సంఘం అధ్యక్షుడు, దేవీ సీఫుడ్స్‌ చైర్మన్‌

మరిన్ని వార్తలు