Fact Check: ఇంత ‘పచ్చ’పాతమా రామోజీ..!? 

23 Nov, 2023 05:31 IST|Sakshi

చంద్రబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చినపుడు ఎందుకు రాయలేదు? 

స్కిల్‌ స్కామ్‌లో బాబు ముఠాను ఈడీ అరెస్ట్‌ చేసినపుడూ కిమ్మనలేదు  

బైజూస్‌ రవీంద్రన్‌కు ఈడీ నోటీసులు ఇస్తే మాత్రం హడావుడి చేస్తారా? 

పరోక్షంగా ప్రభుత్వంపై బురద జల్లాలనేగా మీ రాతల ఉద్దేశం 

సాక్షి, అమరావతి: ‘‘అక్కడ స్పేస్‌ లేదు. అయినా ఆయన స్పేస్‌ క్రియేట్‌ చేసి తీసుకుని వాడుకు­న్నాడు’’ అనేది ఓ ప్రముఖ దర్శకుడి ఫేమస్‌ డైలాగ్‌. నిత్యం ప్రభుత్వంపై దుష్ప్ర­చారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రామోజీ­రావుకు ఆ డైలాగ్‌ అచ్చంగా సరిపోతుంది. బైజూస్‌ సంస్థ సీఈవోకు ఈడీ నోటీసులు ఇస్తే.. ఆ వార్తకు ఈనాడు పత్రికలోని మొదటిపేజీలో ప్రత్యేక స్పేస్‌ ఇచ్చి కథనం రాశారంటేనే ఆయన దురుద్దేశం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.

ఈ వార్త ద్వారా తన ద్వంద్వ వైఖరిని, ‘పచ్చ’పాతాన్ని మరోసారి బయట­పెట్టుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు, సోదాలు, అరెస్ట్‌ల విషయంలో తన అస్మదీయుల విషయంలో ఓ రకంగా.. ఇతరుల విషయంలో మరోరకంగా వ్యవహ­రి­స్తారని రామోజీ నిరూపించుకున్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికే బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌కు ఈడీ నోటీసులు వార్తపై అంత హడావుడి చేశారని ఎవరికైనా అర్థమవుతుంది. 

చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినప్పుడు గప్‌చుప్‌
గతంలో ఈడీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినప్పుడు ఈనాడు గప్‌చుప్‌గా ఉండిపోయింది. ఆ విషయం తన పాఠకులకు తెలియకూడదని భావించింది. అంతేకాదు స్కిల్‌ స్కామ్‌ కేసులో పాత్రధారులైన చంద్రబాబు ముఠా సభ్యులు సుమన్‌ బోస్, వికాస్‌ కన్వేల్కర్, యోగేశ్‌ గుప్తా, వాసుదేవ్‌ పార్థసానిలను ఈడీ అరెస్ట్‌ చేసింది. అంతకుముందు వారి కంపెనీల్లో సోదాలు నిర్వహించింది.

ఆ విషయాలను ఈనాడు కనీసం పట్టించుకో లేదు. ఎందుకంటే వారంతా చంద్రబాబు స్కామ్‌లో కీలక పాత్రధా­రులు. వారి గురించి వార్తలు ప్రచురిస్తే చంద్రబాబు కుంభకోణం గురించి ప్రజలకు తెలియజేయాల్సి వస్తుంది. అందుకే ఈడీ వారిని అరెస్ట్‌ చేసినా.. న్యాయ­స్థానం వారికి రిమాండ్‌ విధించినా సరే తనకు తెలియనట్టే మిన్నకుండిపోయింది. 

బైజూస్‌ సీఈవోకు నోటీసులు ఇస్తే హడావుడి
ఈడీ తాజాగా బైజూస్‌ సంస్థ సీఈవో రవీంద్రన్‌కు నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలో విదేశీ పెట్టుబడులపై సమాధానమివ్వాలని చెప్పింది. ఆ అంశానికి ఈనాడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అత్యధిక ప్రాధాన్యంతో ప్రచురించింది. సంస్థ ఆర్థిక వ్యవహారాలపై నోటీసులు జారీ చేస్తే.. అందుకు రవీంద్రన్‌ సమాధానం చెబుతారు. కానీ ఆ నోటీసుల విషయాన్ని హైలైట్‌ చేసి  ప్రచురించడం ద్వారా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలన్నది ఈనాడు దురుద్దేశం. సంస్థ ఆర్థిక అంశాల మీద నోటీసులకు, ఆ సంస్థ అందించే కంటెంట్‌కు ఎలాంటి సంబంధం ఉండదనే ప్రాథమిక విషయాన్ని రామోజీ మరిచిపోయి రాష్ట్ర ప్రజలను గందరగోళంలో పడేయాలని వార్తలు వండివారుస్తున్నారు.

వక్రీకరణలకు విశ్వప్రయత్నం
ఎడ్యుటెక్‌ కంపెనీల్లో బైజూస్‌ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్య కంటెంట్‌ను ఆ సంస్థ ఉచితంగా అందిస్తోంది. బైజూస్‌ అందిస్తున్న మెటీరియల్‌  ఎంతో ఉపయుక్తంగా ఉందని గుర్తింపు పొందింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈడీ నోటీసుల ప్రభావం పడకుండా అది కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక సాంకేతిక మౌలిక వసతులను సమకూర్చుకోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగవ్వడం అటు చంద్రబాబుకు ఇటు రామోజీరావుకు కంటగింపుగా మారింది.

ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రజాదరణ మరింత పెరుగుతుందన్నదే వారి భయం. అందుకే ఏ చిన్న అంశాన్ని అయినా సరే వక్రీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు యత్నిస్తోంది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక సంస్కరణలను ప్రజలు గుర్తించారు. విపక్షాలు, ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా విద్యా సంస్కరణలను కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు