ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కోనసీమ ‘ప్రభల శకటం’ 

12 Jan, 2023 05:03 IST|Sakshi
ఏకాదశ రుద్రుల ప్రభలు

జగ్గన్నతోట ప్రభల తీర్థానికి 410 ఏళ్ల ఘన చరిత్ర 

సాక్షి, న్యూఢిల్లీ, అంబాజీపేట: దేశ రాజధానిలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏకాదశ రుద్రుల ప్రభల శకటం ఎంపికైంది. సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగే వేడుకలు, పంటలు చేతికి అందే సమయంలో రైతన్నల ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా శకటం ముస్తాబవుతోంది. కోనసీమలో కనుమ రోజు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను వివరిస్తూ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్‌ సభ్యులు రాష్ట్రపతికి లేఖ పంపారు. ప్రభల ఉత్సవంపై వారు రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందిస్తూ నాలుగు  శతాబ్దాలుగా ప్రభల వేడుక నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో గ్రామీణ ప్రాంతాలు పట్టుగొమ్మలుగా నిలుస్తున్నాయని అభినందించారు. 

ఇదీ విశిష్టత 
ఏకాదశ రుద్రులను కనుమ రోజు దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఏటా సంక్రాంతి మర్నాడు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థానికి 410 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లోకకళ్యాణం కోసం పెద్దాపురం సంస్ధానాధీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో 17వ శతాబ్ధంలో తొలిసారిగా ఇక్కడ నిర్వహించారు. ప్రభల ఉత్సవానికి మరో స్థల పురాణం కూడా ఉంది.

17వ శతాబ్ధంలో శివభక్తుడైన జగ్గన్న ఇక్కడున్న పెద్ద మర్రిచెట్టు కింద నిత్యం ధ్యానం చేసుకునేవాడట. పూజలపై పెద్దాపురం సంస్ధానాధీశులు అభ్యంతరం తెలపడంతో జగ్గన్న నేరుగా హైదరాబాద్‌లో ఉండే నవాబును కలిసి ఆయన మెప్పు పొందారట. నవాబు 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా ఇచ్చి అక్కడే శివ పూజ చేసుకునేందుకు జగ్గన్నకు అనుమతి ఇచ్చారు. కాలక్రమేణ ఆ ప్రాంతం జగ్గన్నతోటగా ప్రసిద్ధికెక్కినట్లు స్థల పురాణం చెబుతోంది. జగన్నాధ మహారాజుకు పరమేశ్వరుడు కలలో కనిపించి ప్రభల తీర్థం నిర్వహించమని, ఆదేశించడంతో జగ్గన్నతోట ప్రభల తీర్ధంగా పేరు వచ్చినట్లు ప్రచారం కూడా ఉంది.  

మరిన్ని వార్తలు