వేగంగా, సులభంగా భక్తుల లగేజీ నిర్వహణ

23 Aug, 2023 03:30 IST|Sakshi

కొత్తగా బాలాజీ బ్యాగేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అందుబాటులోకి..

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడి  

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని, సెల్‌ఫోన్లను డిపాజిట్‌ చేసి తిరిగి తీసుకునే ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు.. బాలాజీ బ్యాగేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో మంగళవారం సీవీఎస్వో నరసింహ కిశోర్‌తో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. నూతన విధానంలో లగేజీ, సెల్‌ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్‌ వస్తువులను డిపాజిట్‌ చేస్తే.. ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా సులభంగా పొందవచ్చన్నారు.

భక్తులు కౌంటర్‌ వద్ద లగేజీ ఇవ్వగానే.. వారి వద్ద ఉన్న దర్శన టికెట్‌ను స్కాన్‌ చేసి వాటి వివరాలను ఎల్రక్టానిక్‌ డివైస్‌లో నిక్షిప్తం చేస్తామన్నారు. దర్శన టికెట్‌ లేని భక్తులకు వారి వివరాలు, పేరు నమోదు చేసుకుని బ్యాగ్‌కు ఆర్‌ఎఫ్‌ఐడీతో కూడిన ట్యాగ్‌ జతపరిచి క్యూఆర్‌ కోడ్‌ రసీదు ఇస్తామని చెప్పారు. ఫోన్‌ డిపాజిట్‌ కోసం దర్శన టికెట్‌తో పాటు భక్తుల వివరాలు సేకరిస్తామని తెలిపారు. భక్తులకు వారి లగేజీ గురించిన సమాచారం మెసేజ్‌ రూపంలో అందుతుందన్నారు.

భక్తుల రసీదును ఎల్రక్టానిక్‌ డివైస్‌తో స్కాన్‌ చేసిన వెంటనే వారి మొబైల్, లగేజీ భద్రపరిచిన ర్యాక్‌ నంబర్‌ తెలుస్తుందని.. తద్వారా సులభంగా లగేజీ తిరిగి పొందే అవకాశం లభించిందన్నారు. తిరుమలలో 16 కేంద్రాల ద్వారా 44 కౌంటర్లలో ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు.

నూతన విధానం కోసం చెన్నైకి చెందిన చార్లెస్‌ మార్టిన్‌ రూ.2 కోట్లు, బెంగళూరుకు చెందిన వేణుగోపాల్‌ రూ.కోటి, హైదరాబాద్‌కు చెందిన ట్రాక్‌ ఇట్‌ సంస్థ సీఈవో వేదాంతం సోమశేఖర్‌ రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చారని నరసింహ కిశోర్‌ తెలిపారు. సమావేశంలో అధికారులు బాలిరెడ్డి, గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు