కోర్టుకు బయలుదేరిన తండ్రి, కుమార్తె అదృశ్యం

22 Apr, 2022 04:36 IST|Sakshi

ఎస్పీతో విచారణ జరిపించి, వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరచండి

జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: కోర్టుకు వాస్తవాలను వివరించేందుకు బయలుదేరిన తండ్రి, కుమార్తెను కొందరు అడ్డుకున్న ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ చేత విచారణ జరిపించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ యువతిని, ఆమె తండ్రిని శుక్రవారం ఉదయం తమ ముందు వ్యక్తిగతంగా హాజరుపరచాలని నిర్దేశించింది. ఆకస్మిక అదృశ్యంపై వారి వాంగ్మూలాలను నమోదు చేసి వాస్తవాలు తేలుస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

మజ్జి మాధవి వయస్సు 20 ఏళ్లు అయినప్పటికీ 10వ తరగతి చదువుతుందన్న కారణంతో శ్రీకాకుళం జిల్లా రావిచాద్రి గ్రామస్థాయి బాల్యవివాహ నిషేధ అధికారి ఆమె వివాహాన్ని అడ్డుకుంటున్నారంటూ మజ్జి ఆదినారాయణ, ఆయన కుమార్తె మజ్జి మాధవి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని శిశుసంక్షేమ శాఖ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

కేసు తిరిగి విచారణకు రాగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్‌ ఆదినారాయణే తన కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తరువాత వివాహం చేస్తానంటూ అధికారులకు రాసిచ్చారని తెలిపారు. దీనిపై పిటిషనర్ల న్యాయవాది వి.సుధాకర్‌రెడ్డి ఈ విషయాన్ని పిటిషనర్లతో మాట్లాడి నిర్ధారణ చేసుకుంటానని చెప్పడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. న్యాయవాది సుధాకర్‌రెడ్డి పిటిషనర్లతో మాట్లాడగా.. అధికారులు తెల్లకాగితాలపై తమ వేలిముద్రలు తీసుకున్నారని, తామెలాంటి రాతపూర్వక వివరాలివ్వలేదని చెప్పారు.

ఈ విషయాలను స్వయంగా కోర్టుకు తెలిపేందుకు రావాలని సుధాకర్‌రెడ్డి సూచించగా ఆదినారాయణ, మాధవి బుధవారం శ్రీకాకుళం నుంచి విజయవాడ బయలుదేరారు. వారు కోర్టుకు రాలేదు. వారిని సంప్రదించేందుకు సుధాకర్‌రెడ్డి ప్రయత్నించినా వారి ఆచూకీ తెలియలేదు. వారు హైకోర్టుకు వస్తున్నారన్న విషయాన్ని వారి ఇంటి ఎదురుగా ఉన్న వలంటీర్‌ స్థానిక వీఆర్‌వోకు చేరవేశారని, తర్వాత తండ్రి, కుమార్తె ఆచూకీ తెలియడంలేదని న్యాయవాది సుధాకర్‌రెడ్డి గురువారం కోర్టుకు నివేదించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్‌ దేవానంద్‌ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని, పిటిషనర్లు ఆదినారాయణ, మాధవిలను శుక్రవారం కోర్టుముందు హాజరుపరచాలని కలెక్టర్‌ను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు