కూతురు బాధ చూడలేఖ.. ఓ తండ్రి ఆత్మహత్య

28 Oct, 2021 09:14 IST|Sakshi
తలపాగల శ్రీనివాసరావు (ఫైల్‌).. మరణ వాంగ్మూలం చూపుతున్న కుమార్తె మాలిని 

సాక్షి, రామచంద్రపురం రూరల్‌: కూతురు జీవితం పెళ్లి పేరుతో నాశనమైందనే వేదనతో ఓ తండ్రి లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ద్రాక్షారామకు చెందిన తలపాగల శ్రీనివాసరావు(61) ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈయన బీఫార్మసీ చదువుకున్నారు. భార్య సుజాత, కుమారుడు భవాని శంకర్, కూతురు ఈశా మాలిని ఉన్నారు.

గతేడాది డిసెంబరులో మాలినికి వివాహం ఏలూరు సమీపాన ఫతేబాదకు చెందిన కారుపర్తి గౌతంకుమార్‌తో జరిపించారు. రూ.2 లక్షలు నగదు, 15 కాసులు బంగారం కట్నంగా అందజేశారు. అయితే పెళ్లయిన మర్నాటి నుంచే మాలినికి వేధింపులు మొదలయ్యాయి. కట్న కానుకల కోసం వేధించడంతో మాలిని పుట్టింటిలోనే ఉండిపోయింది. తండ్రి శ్రీనివాసరావు కలత చెందేవారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా అరెస్టులు జరగలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అతను ఆత్మహత్య చేసుకోవాలని భావించి పాయిజన్‌ ఇంజక్షన్‌ చేసుకున్నట్లు సమాచారం.

చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..)

అనంతరం భార్యతో కలసి ద్రాక్షారామ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్సై తులసీరామ్‌ను కలసి కుమార్తె కేసు విషయమై మాట్లాడుతూ పడిపోయారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులకు శ్రీనివాసరావు దస్తూరీతో లేఖ కనిపించింది. అల్లుడు గౌతమ్‌కుమార్, అతని తల్లిదండ్రులతోపాటు మిగిలిన కుటుంబ సభ్యులు కట్న, కానుకల కోసం వేధించారని లేఖరో పేర్కొన్నారు. అందరి పేర్లు రాస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోదరితోపాటు బావ గురించి కూడా లేఖలో శ్రీనివాసరావు ప్రస్తావించారు. మరో అమ్మాయికి ఇలాంటి బాధ రాకూడదని రాశారు. 

మరిన్ని వార్తలు