సంక్షేమం వద్దని ప్రతిపక్షం చెప్పగలదా!?

24 Mar, 2023 04:42 IST|Sakshi

ఆ పథకాలవల్ల వెనుకబడ్డామని ఎవరైనా నిరూపించగలరా? 

రాష్ట్రంలో అధిక గ్రోత్‌రేటు నమోదు కావడానికి సంక్షేమ పథకాలూ కారణమే 

13,000 గ్రామాల్లో వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు 

నాడు–నేడు, మిడ్‌ డే మీల్, స్కాలర్‌షిప్‌లు, విద్యా దీవెన, 

వసతి దీవెనలన్నీ సంక్షేమ వ్యయం కింద జమకట్టకూడదు 

‘మండలి’లో బడ్జెట్‌ సమాధానంలో ఆర్థిక మంత్రి బుగ్గన 

సాక్షి, అమరావతి :  పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరంలేదని ప్రజల ముందుకొచ్చి చెప్పగలరా అంటూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. శాసన మండలిలో 2023–24 బడ్జెట్‌ మీద జరిగిన చర్చకు ఆయన గురువారం సమాధానమిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం అన్నది మా ప్రభుత్వ విధానమని.. పేద ప్రజలకు అన్ని విధాలా సాయం అందించాలన్నదే తమ నినాదమనిస్పష్టంచేశారు.

నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలకే ఈ ప్రభుత్వం ఖర్చుచేస్తోందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలవల్ల రాష్ట్రాభివృద్ధి వెనుకబడిందని నిరూపించగలరా అంటూ ప్రశ్నించారు. ఏదైనా సంక్షోభ సమయంలో వ్యవస్థలోకి నగదు పంపిణీ చేయడం ద్వారా ఆర్థి క వ్యవస్థను కాపాడటం అనేది ప్రపంచ దేశాలు చేస్తుంటాయని, వృద్ధిరేటు సాధించడంలో సంక్షేమం కూడా కీలకపాత్ర పోషిస్తుందని బుగ్గన తెలిపారు.

2019–20లో 5.7 శాతం వృద్ధితో రూ.9.25 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్‌డీపీ..  2022–23లో 16.22 శాతం వృద్ధితో రూ.13.17 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అవినీతికి అవకాశంలేకుండా పూర్తి పారదర్శక పాలనతో ఉత్పత్తిని పెంచుతూ వృద్ధిరేటును నమోదు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. నాడు–నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధి, మిడ్‌ డే మీల్, స్కాలర్‌షిప్‌లు, విద్యాదీవెన, వసతి దీవెన వంటి వాటిని సంక్షేమ పథకాలుగా పరిగణించకూడదన్నారు.

ఇక ఆరోగ్యరంగానికి పెద్దపీట వేస్తూ 13వేల గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్‌్టను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బుగ్గన తెలిపారు. టీడీపీ హయాంలో అప్పులు భారీగాచేసి అభివృద్ధి చేయలేదని.. కానీ, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ అప్పులు చేసినా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ గణాంకాలతో ఆయన వివరించారు. అలాగే, గత ప్రభుత్వం పరిమితికి మించి చేసిన అప్పులు, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను తమ ప్రభుత్వం  సరిచేస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు