ప్రతి ‘పార్లమెంట్‌’ పరిధిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్

20 Apr, 2021 04:33 IST|Sakshi

రూ.2,900 కోట్లతో నిర్మాణం

రైతు భరోసా కేంద్రాల నుంచి నేరుగా పంటల కొనుగోలు

ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ బాధ్యతలు 

పరిశ్రమల శాఖ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రైతులకు అధిక ఆదాయం, స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌(ఆహార శుద్ధి పరిశ్రమ) యూనిట్‌ ఏర్పాటు చేయబోతోంది. సుమారు రూ.2,900 కోట్ల పెట్టుబడి అంచనాతో ప్రతి పార్లమెంటు పరిధిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, ఇంక్యుబేషన్‌ సెంటర్, ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు పెట్టనుంది. దీనికి సంబంధించి ప్రాజెక్ట్‌ కన్సల్టెన్సీగా ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ను నియమిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక, మౌలిక వసతుల కల్పన, డీపీఆర్‌ తయారీ, బిడ్లు పిలవడం, కంపెనీలను ఎంపిక చేయడం, రైతులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం తదితర కార్యకలాపాలను ‘ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రా’ నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సేవలకు గానూ ఫీజు చెల్లించనున్నారు. 

రైతులకు లబ్ధి చేకూర్చేలా.. 
ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో అభివృద్ధి చేసే ఈ యూనిట్లను నిర్వహించే కంపెనీ.. ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి లీజు రూపంలో అద్దె చెల్లిస్తుంది. వీటికి అవసరమైన ముడి సరుకును నేరుగా రైతుల నుంచి సేకరించి రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్‌ల ద్వారా సరఫరా చేస్తారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, డైరీ, ఆక్వా, ఇతర వ్యవసాయ పంట ఉత్పత్తులు వృథా కాకుండా.. వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పంటలను సకాలంలో పూర్తిగా విక్రయించుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ఈ యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ కంపెనీ ఎంపిక వంటి పూర్తిస్థాయి సేవలను ‘ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రా’ అందిస్తుందని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈవో చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు