-

నాటిన ప్రతి మొక్క.. చెట్టవ్వాల్సిందే!

28 Nov, 2022 06:10 IST|Sakshi

కొత్త గ్రీనింగ్‌ పాలసీకి అటవీ శాఖ కసరత్తు 

సంఖ్య కాదు.. నాణ్యతకే ప్రాధాన్యం

శాస్త్రీయ పద్ధతిలో మొక్కల పెంపకానికి పరిశోధనలు

ఏ ప్రాంతంలో ఏ తరహా మొక్కలు నాటాలనే దానిపై అధ్యయనం

సాక్షి, అమరావతి: మొక్కల పెంపకాన్ని మొక్కుబడిగా కాకుండా.. ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వాతావరణం, నేల స్వరూపాలకు తగినట్లుగా మొక్కలను పెంచేలా కొత్త గ్రీనింగ్‌ పాలసీ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్ని మొక్కలు నాటామనే సంఖ్యకు కాకుండా.. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని అటవీ శాఖ నిర్ణయించింది. గ్రో మోర్‌ వుడ్‌.. యూజ్‌ మోర్‌ వుడ్‌(ఎక్కువ కలప పెంచు.. ఎక్కువ కలప ఉపయోగించు) అనే నినాదానికి అనుగుణంగా కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది.

గతంలో కలపతో చేసిన వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండేది. దీంతో కలప తరిగిపోయి.. ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం పెరిగింది. ఇప్పుడు ప్లాస్టిక్‌ వల్ల ప్రమాదమని గ్రహించిన ప్రజలు మళ్లీ చెక్క వస్తువుల వైపు చూస్తున్నారు. అలాగే వాతావరణంలో కూడా కర్బన ఉద్గారాలు పెరిగిపోయాయి. పచ్చదనం పెరిగితే తప్ప ఆక్సిజన్‌ ఉత్పత్తికి వేరే మార్గం లేదని తేలిపోయింది.

ఇందుకు తగ్గట్టుగా మొక్కలు నాటే విధానాన్ని ఆధునికంగా, శాస్త్రీయంగా మార్చాలనే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏపీలోనూ ఇందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. అడవులతో పాటు వాటి వెలుపల, రోడ్లు, కాలువలు పక్కన, పార్కులు, ఇతర ప్రాంతాల్లో అక్కడి వాతావరణం, నేల స్వభావం, నీటి వనరుల లభ్యత, కలప అవసరాలకు అనుగుణంగా.. ఏ జాతి మొక్కలు నాటాలో నిర్ణయించేలా రాష్ట్ర అటవీ శాఖ చర్యలు చేపట్టింది. 

ప్రతి జిల్లాలో వాణిజ్య నర్సరీలు 
రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల స్వరూపాన్ని కూడా పూర్తిగా మార్చివేయాలని భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒకటి, రెండు వాణిజ్య నర్సరీలను ఆధునిక రీతిలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నర్సరీల్లో స్థానికంగా పెరిగే వృక్ష జాతులు, జన్యుమార్పిడి చేసిన మొక్కలు లభించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో రెండు, మూడు చోట్ల పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యాధునికంగా మొక్కలు పెంచే విధానం, వేగంగా పెరిగే మొక్కలు తదితర కోణాల్లో పరిశోధనలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. 

సరికొత్తగా పచ్చదనం..
అడవులతో పాటు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో.. ప్రతి చోటా అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఏ మొక్కలు నాటాలి, వాటి నిర్వహణ తదితరాలపై శాస్త్రీయంగా పరిశోధనలు చేయిస్తాం. ఎలాంటి మొక్కలు నాటాలో చెప్పడంతో పాటు.. అవి సక్రమంగా పెరిగేలా చూసేందుకు చర్యలు తీసుకుంటాం. కొత్త గ్రీనింగ్‌ పాలసీ ప్రకారం రాష్ట్రంలో పచ్చదనం పెంపు సరికొత్తగా, నాణ్యంగా ఉండేలా చూస్తాం.     
– వై.మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌  

మరిన్ని వార్తలు