వడివడిగా కన్నుల పండుగగా..

30 Jul, 2021 03:24 IST|Sakshi

క్రమంగా నిండుతున్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు

శ్రీశైలం ప్రాజెక్టులోకి మరింత పెరిగిన వరద

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. అలాగే ఉపనదుల నుంచి జోరుగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి 5.37 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే. ప్రాజెక్టులో 884 అడుగుల స్థాయిలో నీటి నిల్వ ఉంచుతున్నారు. గురువారం ఉదయం 10 గేట్లను పది అడుగుల మేర ఎత్తారు. 3 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను వరుసగా మూడో ఏడాది ఎత్తడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.  

వరద ప్రవాహం పెరిగితే దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని పెంచుతామని శ్రీశైలం ప్రాజెక్టు సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దాంతో నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ వేగంగా పరుగులు తీస్తోంది. గురువారం సాయంత్రానికి సాగర్‌లో నీటి నిల్వ 204.96 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణ సర్కార్‌ సాగర్, పులిచింతల్లో విద్యుత్‌ఉత్పత్తి  చేస్తూ నీరు వదిలేస్తోంది. నాగార్జుసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులోని 2 యూనిట్ల ద్వారా 46 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈ బి.కాసులు తెలిపారు. పులిచింతల నుంచి వస్తున్న నీటికి వైరా, కట్టలేరు, మున్నేరు ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 10,468 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 9,018 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు