ఎమ్మెస్పీకి మించి మార్కెట్‌ ధరలు

8 Apr, 2023 05:13 IST|Sakshi

ఫైన్‌ వెరైటీ ధాన్యంతో సహా 13 రకాల పంటలకు మంచి ధరలు

సాధారణ, గ్రేడ్‌–ఏ ధాన్యం పూర్తిగా ఎమ్మెస్పీకి ప్రభుత్వం కొనుగోలు

ధరలు తగ్గిన ప్రతీసారి అండగా సర్కారు

‘రైతుబంధు’ అవసరం లేకుండానే కల్లాల నుంచే రైతుల అమ్మకాలు

నాలుగేళ్లలో రైతుబంధు పథకానికి రూ.310 కోట్లు కేటాయింపు

అయినా ఈ పథకాన్ని నిలిపివేశారంటూ విష ప్రచారం

రైతులకు రుణాలివ్వడం లేదంటూ ఈనాడు గగ్గోలు

సాక్షి, అమరావతి: గతంలో విత్తుకునే సమయంలో ఉండే ధర పంటలు కోతకోసే నాటికి ఉండేది కాదు. దీంతో కాస్త మంచిరేటు వచ్చేవరకు మార్కెట్‌ గోదాముల్లో నిల్వచేసుకుని, ‘రైతుబంధు’ పథకం కింద రుణాలు తీసుకుని సాగుకోసం పెట్టిన అప్పులను తీర్చుకునేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

నాలుగేళ్లుగా రాష్ట్రంలో పండే ప్రధాన వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంలో ఎన్నడూలేని రీతిలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు మించి మార్కెట్‌లో ధరలు పలుకుతున్నాయి. కల్లాల నుంచి నేరుగా కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ఫలితంగా తాము పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు గోదాముల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. రుణాలు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా ఈనాడు కట్టుకథలను అచ్చేస్తూ నిత్యం అభాసుపాలవుతోంది.

ఏటా బడ్జెట్‌ కేటాయింపులు..
కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులకు మంచి ధర లభించేంత వరకు వారికి అండగా నిలిచేందుకు ఉద్దేశించిందే రైతుబంధు పథకం. మార్కెట్‌ గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు అందించే రుణంపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు.

ఆ తర్వాత 181వ రోజు నుంచి 270 రోజుల వరకు 12శాతం చొప్పున వడ్డీ వసూలుచేస్తారు. ఈ పథకానికి 2019–20లో రూ.70 కోట్లు, 2020–21లో రూ.70 కోట్లు, 2021–22లో రూ.80 కోట్లు కేటాయించగా, గడిచిన 2022–23లో ఏకంగా రూ.90 కోట్లు కేటాయించింది.  2019–20లో ఈ పథకం కింద తమ పంట ఉత్పత్తులను నిల్వచేసుకోవడం ద్వారా 1,826 మంది రూ.17.23 కోట్ల రుణాలు పొందగా, 2020–21లో 517 మంది రూ.71లక్షలరుణాలు పొందారు.

ఎమ్మెస్పీకి మించి మార్కెట్‌ ధరలు
సీఎం యాప్‌ ద్వారా గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఎమ్మెస్పీకి మించి ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుంటూ ధరలు పెరిగేలా చేస్తోంది. సాధారణ, గ్రేడ్‌–ఏ రకం ధా న్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.  ఫలితంగా ఇతర పంట ఉత్పత్తులకు కూడా మంచి రేటు పలుకుతోంది.

కోతల దశలోనే ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతుండడంతో మంచి ధర కోసం పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వచేసుకోవడం, రైతుబంధు పథకం కింద రుణాలు పొందాలన్న ఆసక్తి రైతుల్లో కనిపించడంలేదు. కళ్లెదుట వాస్తవాలిలా ఉంటే.. రైతుబంధు పథకాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసినట్లు, పంట నిల్వచేసుకునే రైతులకు రుణాలివ్వడానికి ప్రభుత్వం ముఖం చాటేసినట్లుగా ఈనాడు విషప్రచారం చేస్తుండడంపట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రైతుబంధుకు ఏటా కేటాయింపులు
మార్కెట్‌లో మించి ధరలు లభిస్తుండడంవల్లే గోదాముల్లో దాచుకునేందుకు రైతులు ముందుకు రావడంలేదు.అలాగే రైతులెవ్వరూ రైతుబంధు పథకం కింద రుణం పొందేందుకు ముందుకు రావడం లేదు. దీనిని రద్దు చేయడంగానీ, ఏటా నిధుల కేటాయింపులు ఆపడంగానీ చేయలేదు. రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.     – రాహుల్‌ పాండే, కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ

మరిన్ని వార్తలు