AP Govt: వశిష్ట నిర్మాణానికి ఓకే.. రూ.490 కోట్ల వ్యయంతో వారధి..

27 Nov, 2022 13:00 IST|Sakshi
సఖినేటిపల్లిలో వశిష్ట వంతెనకు 2008లో వైఎస్సార్‌ శంకుస్థాపన చేసిన శిలా ఫలకం, నరసాపురం వశిష్ట రేవులో పంటుపై నదిని దాటుతున్న ప్రయాణికులు

జనవరిలో టెండర్ల ద్వారా పనుల ప్రారంభం 

నర్సాపురం సభలో సీఎం హామీపై హర్షం 

రెండు జిల్లాల రాకపోకలకు మార్గం సుగమం 

సాక్షి, ఏలూరు: తీరప్రాంత ప్రజల చిరకాల కోరికగా మిగిలిన వశిష్ట గోదావరి వారధి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనేక అడ్డంకులు, అవరోధాలు, కోర్టు కేసులను దాటుకుని వచ్చే జనవరిలో టెండర్లు నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించనున్నారు. 

వశిష్ట గోదావరిపై వంతెన కట్టి ప్రజల చిరకాల కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నర్సాపురం పర్యటనలో ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే కీలక బ్రిడ్జి కావడంతో ముఖ్యమంత్రి ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్‌ హయాంలోనే అంకురార్పణ జరిగిన ఈ వంతెన నిర్మాణం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం కూడా ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టారు.  

216 జాతీయ రహదారికి బైపాస్‌ నిర్మించి.. 
రూ.490 కోట్లతో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్‌ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్‌హైవేను జాతీయ రహదారిగా మార్పుచేసి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్‌ పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారికి బైపాస్‌ హైవే రోడ్డు నిర్మించనున్నారు.  

ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు 
2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మైథాస్‌ సంస్థకు అప్పగించారు. అయితే ఈ సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో మళ్లీ మరో కంపెనీకి వంతెన పనులు అప్పగించారు. కానీ ఆయన మృతితో పనులు నిలిచిపోయాయి. తరువాత టీడీపీ ప్రభుత్వం వంతెన విషయంలో అనేక డ్రామాలు నడిపింది. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి పేరు వస్తుందనే వంతెన నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో వంతెన పనులకు టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత తీసుకుని, బ్రిటీష్‌ కాలం నుంచి డిమాండ్‌గా ఉన్న వంతెన నిర్మాణానికి పూనుకుంటున్నారు. 
– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌   

దశాబ్దాల కలల వారధి 
1910లో నరసాపురం పట్టణం వద్ద వంతెన నిర్మాణానికి అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం కేవలం రూ.70 వేలతో అంచనాలు తయారు చేసింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పటి నుంచి నరసాపురం వశిష్ట వంతెన కథ నడుస్తూనే ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలోనూ నేతలు హామీలు ఇవ్వడం, మరిచిపోవడం జరుగుతోంది. 1986లో మొదటిసారిగా నరసాపురం వశిష్ట వంతెనకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శంకుస్థాపన చేశారు. అయితే తరువాత రాజకీయ కారణాలతో ఇక్కడ నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో చంద్రబాబు హయాంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జి అంటూ హడావిడి చేసి శంకుస్థాపన చేశారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా కూడా వశిష్ట వంతెన నిర్మాణంపై సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేసి హడావిడి చేయడం జరిగింది.  

కోర్టులకెక్కి ఆపే ప్రయత్నం.. 
నిజానికి ఈ నెల 18న నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో శంకుస్థాపనలు జరిగిన రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లతో పాటే వశిష్ట వంతెనకు కూడా శంకుస్థాపన జరగాలి. అయితే స్థలసేకరణ విషయం వచ్చేసరికి ఈ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి బీజం పడితే జగన్‌ సర్కారుకు ఎక్కడ పేరు వస్తుందేమోనని.. ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయి. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్‌ చేయించి, ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు. తీరా ముఖ్యమంత్రి పర్యటన దగ్గరికి వచ్చే సమయానికి మళ్లీ రెండోసారి కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీని వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నట్టు సమాచారం.  

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చొరవతో.. 
చించినాడ 216 జాతీయ రహదారికి కోనసీమ జిల్లా నుంచి నరసాపురం వరకూ బైపాస్‌ నిర్మించి, మధ్యలో వంతెన నిర్మిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మోక్షం కలుగుతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీకి లేఖ రాయడం, శివకోడు సఖినేటిపల్లి మీదుగా రామేశ్వరం నుంచి నరసాపురం వరకూ 25 కిలోమీటర్ల మేర స్టేట్‌ హైవేను 216కు బైపాస్‌గా నేషనల్‌ హైవేగా మార్పు చేయాలని, మధ్యలో రాజుల్లంకవద్ద గోదావరిపై వంతెన నిర్మించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖకు స్పందించిన గట్కరీ వెంటనే ఆమోదం తెలపడంతో దశాబ్దాల వంతెన సమస్యకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.    

మరిన్ని వార్తలు