ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు రండి

10 Feb, 2023 05:55 IST|Sakshi

కేంద్ర మంత్రులకు గుడివాడ, బుగ్గన ఆహ్వానం

విశాఖ సదస్సుకు దేశ, విదేశ పారిశ్రామికవేత్తలు

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీ­ల్లో నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని పలువురు కేంద్ర మంత్రులను ఏపీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆహ్వానించారు.గురువారం ఢిల్లీ­లో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, కిషన్‌రెడ్డి, మన్సుఖ్‌ మాండవీయా, సర్బా­నంద సోనోవాల్‌లను  రాష్ట్ర మం­­త్రు­లిద్దరూ కలిశారు.

అనంతరం గుడివాడ అమర్‌­నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో 49 దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన 13 రంగాలకు ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు.

రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి ఉపకరించడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో 49 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. ఇవన్నీ పారిశ్రామిక ప్రగతికి ఉపకరిస్తాయని వెల్ల­డించారు. విశాఖ సదస్సుకు దేశంలోని పారిశ్రామికవేత్తలతో సహా అంతర్జాతీ­య సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు.

గత ప్రభుత్వం సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల ప్రాజెక్టులతోపాటు 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొందని.. అయితే రూ.1.87 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. విశాఖ రాజధాని అని సీఎం పేర్కొనడాన్ని ప్రభుత్వ విధానాల గురించి చెప్పడంలో భాగంగానే చూడాలన్నారు.

కొత్త ప్రకటనలా చూడాల్సిన అవసరం లేదని గుడివాడ అమర్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో కేంద్రం రాజధానిపై వేసిన అఫిడవిట్‌ను చంద్రబాబు చదివినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.  

మరిన్ని వార్తలు