గుంటూరులో ఇద్దరి అరెస్ట్‌

19 May, 2021 08:49 IST|Sakshi

పట్నంబజారు (గుంటూరు): రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డిపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పదజాలంతో పలు వీడియోలు అప్‌లోడ్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను గుంటూరు అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎంపీపై యూట్యూబ్‌లో సీబీఎన్‌ ఆర్మీ అనే చానల్‌ ద్వారా వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా పలు అసభ్యకర పోస్టింగ్‌లు వచ్చాయి.

వీటిని చూసిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా గంటావారిపాలెంకు చెందిన మద్దినేని వెంకట మహేష్‌బాబు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను టీడీపీ సోషల్‌ మీడియా ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాడు. అతనితో పాటు మచిలీపట్నానికి చెందిన ముల్పూరి శ్రీసాయికళ్యాణ్‌ కలిసి ఎంపీపై అసభ్యకర దూషణలు చేస్తూ వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. దర్యాప్తులో సాంకేతికంగా ఈ వివరాలు సేకరించిన పోలీసు సిబ్బంది వారిని చంద్రమౌళినగర్‌లో అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు