రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!

18 Jul, 2022 11:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దాసుడి తప్పు దండంతోనే సరి.. అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అసలు సూత్రధారులను దర్జాగా వదిలేసి.. పాత్రధారులపై కొరడా ఝుళిపించారు జీవీఎంసీ ఉన్నతాధికారులు. నిబంధనలు మీరి రైల్వే స్టేషన్లలో చెత్త తరలింపునకు కార్పొరేషన్‌ వాహనాలు వినియోగించిన వైనం బట్టబయలైంది. అయితే దొరికేంత వరకూ దొరలే అన్నచందంగా.. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే జరిగిందన్నట్లుగా.. అధికారుల కళ్లుగప్పేశారు.

కానీ.. ఈ ‘చెత్త’ బంధం సుమారు రెండేళ్ల నుంచి సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఖజానాకు కన్నం పెట్టి.. రైల్వే కాంట్రాక్టర్‌ కాసులకు కక్కుర్తిపడిన పెద్ద చేపల్ని వదిలేసి.. కేవలం ఒక డ్రైవర్‌ సస్పెన్షన్‌తోనే మమా అనిపించెయ్యడం గమనార్హం. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పరిధిలో పోగవుతున్న చెత్తను తీసేందుకు తీరిక లేని పారిశుధ్య కాంట్రాక్టర్లకు.. తమ పరిధి కాని ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధగా పనులు కానిచ్చేస్తున్నారు.

ఇటీవల రైల్వే స్టేషన్‌లో జరిగిన అక్రమ చెత్త నిర్వహణ అంశం బయటపడిన విషయం విదితమే. అసలేం జరిగిందంటే... రైల్వేస్టేషన్‌ పరిధిలో ఉన్న చెత్త నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ పరిధిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు గానీ, వాహనాలకు గానీ పని లేదు.

కేవలం రైల్వే స్టేషన్‌ మాత్రమే కాదు.. ఏ పబ్లిక్‌ సెక్టార్‌ పరిధిలోనైనా చెత్త నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలు మాత్రమే నిర్వహించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి.. ఆయన అనుమతితోనే ఇక్కడ సిబ్బందిని  చెత్త నిర్వహణ పనులకు వినియోగించుకుంటారు. కానీ రైల్వే స్టేషన్‌లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది. కొందరు స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఇక్కడ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అవాక్కయ్యారు. 

రెండేళ్లుగా.. 
జీవీఎంసీ జోన్‌–4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్‌ తో కలిసి అక్రమార్జన కోసం రైల్వే కాంట్రాక్టర్‌తో అడ్డగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నట్లుగా  చెప్పి ఒక టిప్పర్, బాబ్‌ కార్ట్‌ ని రైల్వే స్టేషన్‌ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పనులు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. దీనికి అవసరమైన ఇంధనాన్ని కూడా జీవీఎంసీకి చెందినదే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యవహారం బట్టబయలవ్వడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే ఇలా జరిగిందంటూ అధికారులకు తప్పుడు సమాచారం అందించారు.

ఇలా రైల్వే స్టేషన్‌లో చెత్త సేకరణకు సుమారు రెండేళ్ల కాలం నుంచి వాహనాల్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ చెత్త సేకరణ సమయం పూర్తయిన వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి చెత్తని తాటిచెట్లపాలెంలోని మినీ సూయిజ్‌ ఫాం(ఎంఎస్‌ఎఫ్‌)కు తరలించినట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టర్‌తో జీవీఎంసీ జోన్‌–5 పరిధిలో ఉన్న ఒక కాంట్రాక్టర్, ముఖ్య అధికారి చేతులు కలిపి ఈ పనులకు వాహనాల్ని పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన రూ.లక్షలాది రూపాయిల ఇంధనాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. 

అసలువారిని వదిలేసి.. 
ఈ అక్రమ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోన్‌–5 అధికారులు, సిబ్బంది, ఎంఎస్‌ఎఫ్‌ కాంట్రాక్టర్‌ ఉలిక్కిపడ్డారు. తప్పు తమవైపు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న సమయంలో ఎంఎస్‌ఎఫ్‌కు వస్తున్నప్పుడు అక్కడి రైల్వే కాంట్రాక్టర్‌ రూ.1000 ఇస్తే.. ఆ ఒక్క రోజు మాత్రమే చెత్తని తీసేందుకు వెళ్లారని అధికారులకు చెప్పారు.

ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్‌ అధికారులను ఆదేశించగా.. జోన్‌–5 అధికారులు టిప్పర్‌ డ్రైవర్‌ను బలిపశువులా సస్పెండ్‌ చేశారు. కాంట్రాక్టర్‌ పరిధిలో ఉన్న బాబ్‌కార్డ్‌ అవుట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌ని మరో చోటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ జీవీఎంసీకి నష్టం తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌పైనా, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అధికారుల ఒత్తిడి లేకుండా దిగువస్థాయి సాధారణ సిబ్బంది ఈ తరహా పనులకు వెళ్లే అవకాశం లేదు. దీనిపై కమిషనర్‌ లక్ష్మీశను వివరణ కోరగా.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.  

(చదవండి: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది)

>
మరిన్ని వార్తలు