డ్రైవింగ్‌ చేస్తుండగా గుండెపోటు 

13 Jun, 2022 05:34 IST|Sakshi
విధుల్లోనే మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్‌ ఇస్మాయిల్‌

అప్రమత్తతతో వ్యవహరించి 40 మంది 

ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్‌ 

చివరకు ఆయన మృతితో విషాదం  

రాయదుర్గం: డ్రైవింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు. ఆ సమయంలోనూ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించాడు. ఓ వైపున నొప్పి గుండెను మెలిపెడుతున్నప్పటికీ పంటి బిగువన బాధను భరిస్తూనే బస్సును నియంత్రించాడు. 40 మంది ప్రయాణికులను కాపాడి.. తాను మాత్రం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.

కండక్టర్‌ హరినాథ్‌ తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన ఇస్మాయిల్‌ (56) స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఏపీ 02 జెడ్‌ 4341 నంబరు గల బస్సును తీసుకుని రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలోని డి.హీరేహాళ్‌ మండలం సోమలాపురం వద్దకు రాగానే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి మొదలైంది.

నీళ్లు తాగి సముదాయించుకుని బస్సును అలాగే ముందుకు నడిపాడు. కొంత సేపటికే నొప్పి మరింత తీవ్రమైంది. వేగంగా వెళుతున్న బస్సును నియంత్రించి రోడ్డు ప్రక్కగా నిలిపాడు. ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే డ్రైవర్‌ ఇస్మాయిల్‌ను సమీపంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాత్ర మింగిన కొద్దిసేపటికే ఇస్మాయిల్‌ మృతి చెందాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి దేవుడిలా తమ ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు