కడప నగరం.. జలమయం

14 May, 2022 00:14 IST|Sakshi
అప్సర థియేటర్‌ సమీపంలో పెద్ద ఎత్తున నిలిచిన వర్షపునీరు

ఎడతెరపి లేని వర్షం 

జలమయమైన రహదారులు

ఇబ్బందులు పడ్డ ప్రజలు

కడప కార్పొరేషన్‌: ‘అసని’ తుపాను ప్రభావంతో నగరంలో జోరుగా వర్షం పడుతూనే ఉంది బుధవారం అర్థరాత్రి నుంచి నిర్విరామంగా కురిసిన వర్షానికి కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తమైంది. మండువేసవిలో వర్షాకాలాన్ని తలపించేలా కురిసిన వర్షాన్ని చూసి జనం ఆశ్చర్యపోయారు. ఉదయం నుంచి సన్నటి జల్లులతో నిరంతరాయంగా కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండు, అప్సర థియేటర్, వై జంక్షన్, మృత్యుంజయకుంట, ఎస్బీఐ కాలనీ, బాలాజీన నగర్,

శాస్త్రి నగర్, గంజికుంట కాలనీ, గౌస్‌ నగర్, పాతకడప, రామాంజనేయపురం, చిన్నచౌకు, ప్రకాష్‌నగర్, ఓంశాంతి నగర్, ఎన్‌టీఆర్‌నగర్, అంగడివీధి, మాసాపేట, నంద్యాల నాగిరెడ్డికాలనీ, రామరాజుపల్లె, ఎన్‌జీఓ కాలనీ, అల్లూరి సీతారామరాజు నగర్, రామకృష్ణ నగర్, భరత్‌ నగర్, మేకల దొడ్డి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధి వ్యాపారస్తులు, తోపుడు బండ్ల వ్యాపారులు అవస్థలు పడ్డారు. మోకాలిలోతుకుపైగా ఉన్న నీటిలో వాహనాలు దిగడం వల్ల ఇంజిన్లలోకి నీరు చేరి అవి మొరాయించాయి. పాత కడపలో పెద్ద ఎత్తున వర్షపునీరు నిలవడంతో పాతకడప జెడ్పీ స్కూల్‌లో పరీక్ష రాసే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 

మరిన్ని వార్తలు