AP: ఆ జిల్లాలకు అలర్ట్‌.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు 

18 Mar, 2023 04:12 IST|Sakshi

కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు 

ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు 

మరో మూడు రోజులు కురుస్తాయని ఐఎండీ వెల్లడి 

ఉరుములు, మెరుపులు, పిడుగులకు అవకాశం 

గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు 

పిడుగుల శబ్దాలకు ఇద్దరు వృద్ధులు మృతి 

సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్‌: ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్‌ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.

బంగ్లాదేశ్‌ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన మరో ద్రోణి శుక్రవారం బలహీనపడింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్,  గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు జిల్లాల్లో, ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు  30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో త్రిపురాంతకం కోట (తిరుపతి)లో 7.3 సెంటీమీటర్లు, అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)లో 5, రేపల్లె (బాపట్ల)లో 4.8, పోతిరెడ్డిపాలెం (కృష్ణా)లో 4.7, ఎన్‌.కండ్రిగ (చిత్తూరు), గుడ్లదోన (ఎస్పీఎస్సార్‌)లో 3.8, శివరాంపురం (అన్నమయ్య)లో 3.7, గుంటూరు పశ్చిమలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, నంద్యాల జిల్లాలో  గురువారం రాత్రి, శుక్రవారం వడగండ్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి పిడుగుల శబ్దాలకు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. 
 

మరిన్ని వార్తలు