ఎడతెరిపిలేని వర్షాలతో వణుకు

30 Nov, 2021 03:31 IST|Sakshi
నీట మునిగిన వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల బస్టాండు

నాలుగు జిల్లాల్లో రెండ్రోజులుగా భారీ వర్షాలు 

పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు  

పలు చెరువులకు గండ్లు 

అధికార యంత్రాంగం అప్రమత్తం   

ప్రమాదకర స్థాయిలో ‘నెల్లూరు’లోని కైవల్యా, స్వర్ణముఖి నదులు 

చిత్తూరు జిల్లాలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు 

సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఆయా జిల్లాల్లోని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. ఆది, సోమవారాలు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాగులు, వంకలు, పొంగి ప్రవహించాయి.

కైవల్యా, స్వర్ణముఖి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నై– కోల్‌కతా ఏషియన్‌ హైవేపై గూడూరు వద్ద నీరు పొంగి ప్రవహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను దారి మళ్లించారు. జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ఎక్కడా ప్రాణనష్టం లేకుండా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు. కండలేరు డ్యామ్‌ కట్టకు ఎలాంటి ప్రమాదంలేదని అధికారులు తేల్చి చెప్పారు.  
నెల్లూరు నగరంలోని కస్తూర్బా స్కూల్‌ ఎదురుగా జీఎన్‌టీ రోడ్డులో వర్షపు నీరు 

ముసురుకున్న ‘చిత్తూరు’ 
ఎడతెరిపిలేని జల్లులతో చిత్తూరు జిల్లా ముసురేసింది. ఆదివారం రాత్రి తూర్పు మండలాల్లో భారీవర్షం కురవగా మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 30.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా తొట్టంబేడు మండలంలో 110.6 , బీఎన్‌ కండ్రిగలో 100.4 మిల్లీ మీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. తూర్పు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు, నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు కాజ్‌వేలు, చెక్‌ డ్యామ్‌లకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 2 వేల మందికి ఆశ్రయం కల్పించారు. 34,682 మందికి నిత్యావసరాలతో పాటు రూ.2 వేల చొప్పున ప్రభుత్వ సాయాన్ని అందించారు. పశువులకు పశుగ్రాసాన్ని తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. తిరుపతిలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో రీచార్జ్‌ కావడంతో నిండ్ర మండలం కచ్చరవేడు గ్రామంలోని బోరుబావి కేసింగ్‌ పైపు 32 అడుగుల మేర పైకి వచ్చింది. మదనపల్లె మండలం వేంపల్లి వద్ద కొండమీదతండా చెరువుకు గండిపడింది. దీంతో అధికారులు మరమ్మతు పనులను చేపడుతున్నారు. 

‘ప్రకాశం’లో పొంగుతున్న వాగులు
ఇక ప్రకాశం జిల్లాలోనూ రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లపాడు ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం చేరుతుండడంతో దిగువనున్న మన్నేరుకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. దీంతో మన్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొమరోలు మండలంలోని పులివాగు, గుడ్లూరు మండలంలోని ఉప్పుటేరు, ఎలికేరులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వైఎస్సార్‌ జిల్లాలోనూ.. 
వైఎస్సార్‌ జిల్లాలోని కాశినాయన మండలంలో సోమవారం 8.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, పోరుమామిళ్లలో 8 సెం.మీ. కురిసింది. బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు, బి.మఠం, బి.కోడూరు, కడప తదితర ప్రాంతాల్లో 5 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది.  పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి.  ఉధృతంగా ప్రవహిస్తున్న దిగువ సగిలేరు ప్రాజెక్టు నుంచి దిగువన పెన్నాకు నీటిని విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు