కఠిన ఆంక్షలు అమలు చేయండి

9 Sep, 2021 02:45 IST|Sakshi

కోవిడ్‌ పాజిటివిటీ పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి

కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలి

ప్రభుత్వానికి హైకోర్టు సూచన

తదుపరి విచారణ ఈనెల 22కి వాయిదా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే కఠిన ఆంక్షలను అమలు చేయాలంది. ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్‌ విషయంలో పలు అభ్యర్థనలతో దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్‌ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది వై.వి.రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయుల్లో 50 శాతం మందికే వ్యాక్సినేషన్‌ జరిగిందని, అయినా ప్రభుత్వం పాఠశాలలు తెరిచిందని చెప్పారు. మాస్క్‌లు వేసుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, వారికి ప్రభుత్వం జరిమానా విధించకపోతుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ ఈ వాదనలను తిప్పికొట్టారు. ఎంతమందికి జరిమానా విధించి ఎంత మొత్తం వసూలు చేసిందీ గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ధర్మాసనం ప్రస్తావించగా.. పత్రికలు ఏమైనా రాస్తాయంటూ ఇటీవల రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు చెప్పారు.

కోవిడ్‌ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటునకు ఎలాంటి అనుమతినివ్వలేదని తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన అశోక్‌రామ్‌ జోక్యం చేసుకుంటూ.. ఓనం సందర్భంగా వేడుకల నిర్వహణకు కేరళ ప్రభుత్వం అక్కడి ప్రజలకు అనుమతి ఇచ్చిందని, దీంతో దేశంలోనే ఇప్పుడు అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ నిలిచిందని చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు