చెలరేగిపోతున్న కార్పొరేట్‌ కళాశాలలు ..అధికంగా ఫీజుల వసూలు 

20 Feb, 2023 19:30 IST|Sakshi

నిబంధనల ఉల్లంఘన

సౌకర్యాల కల్పనలో విఫలం

ఫీజుల ఒత్తిడి భరించలేని విద్యార్థులు

అధిక ఫీజులకు కళ్లెం వేయలేకపోతున్న ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు

హితేష్‌ అనే విద్యార్థి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ‘చైనా’ బ్యాచ్‌ అని, 24 గంటలూ ఏసీ అని రూ.90 వేలు ఫీజు కట్టించుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.15 వేలు వసూలు చేశారు. హాస్టల్‌కు నెలకు రూ.5 వేల చొప్పున కట్టించుకున్నారు. 

నారాయణ కళాశాలలో నర్మద అనే  విద్యార్థినికి ఐఐటీ కోచింగ్‌ పేరుతో ఏడాదికి రూ.75 వేలు, హాస్టల్‌కు నెలకు రూ.5 వేలు చొప్పున కట్టాలని చెప్పారు. పుస్తకాలు, ప్రాక్టికల్స్‌ పేరుతో మరికొంత చెల్లించాలని ఒత్తిడి చేశారు. తలకు మించిన భారం కావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం నారాయణ కళాశాలలో టీసీ తీసుకుని.. కూతురిని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేర్చారు. 

నారాయణ విద్యా సంస్థల్లో ముందస్తుగా అడ్మిషన్లు చేయడానికి పీఆర్వోలను నియమించుకున్నారు. ముందుగా చేరితే ఫీజుల రాయితీ ఇస్తామని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. జెడ్‌ఎఫ్‌బీ, ఎన్‌120, కోస్పార్క్‌ అని ఆకర్షణీయమైన పేర్లు పెట్టి స్టడీ మెటీరియల్‌పై అమాంతంగా ఫీజులు పెంచుతున్నారు. 

అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిని భవ్యశ్రీ ఇటీవల కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఫీజు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఫీజు కట్టలేదని అందరి ముందు అవమానించడం, క్యాంపస్‌ బయట నిల్చోబెట్టడం, రికార్డులు, హాల్‌టికెట్లు ఇవ్వబోమని బెదిరించడం కార్పొరేట్‌ కళాశాలల్లో షరామామూలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవ్యశ్రీ లాంటి విద్యార్థినులు ఎంతోమంది అర్ధంతరంగా చదువులు మానేయడం.. ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు. 

అనంతపురం: కార్పొరేట్‌ కళాశాలలు అడ్డగోలు సంపాదనకు తెరలేపాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అదనంగా వసూలు చేస్తున్నాయి. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్‌ కళాశాలల్లో అధిక ఫీజులు, వసూళ్ల కోసం వేధింపులు పరాకాష్టకు చేరుతున్నాయి. సూపర్‌ –20, ఐఐటీ తదితర కోర్సుల పేరుతో విచ్చలవిడిగా వసూలు చేస్తూ తల్లిదండ్రులపై విపరీతమైన భారం మోపుతున్నారు. విద్యార్థుల్లోనూ మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. దీని నుంచి విద్యార్థులు బయటపడలేక అర్ధంతరంగా చదువు మానేయడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తోంది. కళాశాలలపై పర్యవేక్షణ చేయాల్సిన ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు నిమ్మను నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  

హాస్టల్‌ ఫీజు ఏడాదికి రూ.60 వేలట! 
నారాయణ కళాశాలలో ఒక్కో విద్యార్థికి హాస్టల్‌ ఫీజు రూ.60 వేలుగా నిర్ధారించారు. నెలకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తూ ఒక్కో గదిలో 10 మందిని కేటాయించారు. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదు. ఇదే విషయం ఇటీవల తనిఖీలో వెలుగు చూడటంతో జాయింట్‌ కలెక్టర్‌ జరిమానా విధించారు. ఒక్కో విద్యార్థికి ఇంటర్మీడియెట్‌లో ఫీజు రూ.20 వేలు దాటకూడదు. కానీ కార్పొరేట్‌ కళాశాలలు రూ.65 వేల నుంచి రూ.80 వేల దాకా వసూలు చేస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే చదవాల్సి ఉన్నప్పటికీ సొంత మెటీరియల్‌ పేరుతో మరో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఏడాదికి హాస్టల్‌ ఫీజు, కళాశాల ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అంత డబ్బు చెల్లించుకోలేని వారు తమ పిల్లలను చదువు మాన్పిస్తున్నారు.

అన్నీ అద్దె భవనాలే.. 
నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఏ ఒక్క బ్రాంచ్‌కూ సొంత భవనాలు ఉండవు. అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలల హవా నడిచినన్నాళ్లూ తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేసి.. అద్దె భవనాలు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చుననే ఎత్తుగడతోనే కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉన్నతాధికారులకు నివేదించాం 
నారాయణ కళాశాల ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 
– డాక్టర్‌ సురేష్‌బాబు, ఆర్‌ఐఓ, అనంతపురం  

మరిన్ని వార్తలు