పోలవరంపై హైపవర్‌ కమిటీ భేటీ రద్దు

30 Nov, 2021 03:58 IST|Sakshi

పార్లమెంట్‌ సమావేశాల తర్వాత నిర్వహించే అవకాశం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం జరగాల్సిన హైపవర్‌ కమిటీ భేటీ రద్దయింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు పూర్తయిన తర్వాత హైపవర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరంతో సహా 16 జాతీయ ప్రా జెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ భేటీ వర్చువల్‌ విధానంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కేంద్ర జల్‌ శక్తి శాఖ శుక్రవారం ప్రకటించింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కావడం.. లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర జల్‌ శక్తి శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో పంకజ్‌కుమార్‌ వాటిలో నిమగ్నమయ్యారు. దాంతో హైపవర్‌ కమిటీ సమావేశాన్ని  రద్దు చేశారు.  

మరిన్ని వార్తలు