మహిళలకు కోటి డోసుల టీకా

20 Jul, 2021 03:06 IST|Sakshi

రాష్ట్రంలో వారికే ఎక్కువ డోసుల వ్యాక్సిన్‌

పురుషులకు వేసిన డోసులు 84.66 లక్షలు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లోనూ మహిళలే ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలకు కోటి డోసులకుపైగా టీకా వేశారు. జనాభా ప్రాతిపదికన అయితే మన రాష్ట్రంలోనే మహిళలకు అత్యధిక డోసులు వేసినట్టు తాజా గణాంకాలతో వెల్లడైంది. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి మన రాష్ట్రంలో మొత్తం 1.86 కోట్ల డోసుల టీకా వేశారు. వీటిలో 1.01 కోట్ల డోసులు మహిళలకే వేశారు. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో పురుషులకే ఎక్కువ డోసులు వేశారు. దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా ప్రక్రియ మొదలైంది.

మన రాష్ట్రంలో తొలి 3 నెలలు చాలామంది టీకాపై ఆసక్తి చూపకపోయినా ఏప్రిల్‌ నుంచి భారీగా స్పందించారు. తాజాగా టీకా వేయించుకున్న మహిళల్లో 20 లక్షలమంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులున్నారు. ప్రస్తుతం గర్భిణులకు కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. 45 ఏళ్ల పైన వయసున్న వారు, ఉపాధ్యాయులు, మానసిక వికలాంగులు, వృద్ధులు వంటివారికి శరవేగంగా టీకా ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరిల్లో మాత్రమే పురుషులకంటే మహిళలకు ఎక్కువగా టీకా డోసులు వేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.15 కోట్ల డోసుల టీకా వేశారు. వీటిలో పురుషులకు 21.47 కోట్ల డోసులు, మహిళలకు 18.67 కోట్ల డోసులు వేశారు.

మరిన్ని వార్తలు