విజయ గీతిక.. ప్రగతి వీచిక

25 Sep, 2022 13:26 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్‌ చరిత్రను ఓటర్లు తిరగరాసి ఆదివారంతో ఏడాది పూర్తవుతోంది. ప్రజాకంటక తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడిన ప్రజలు.. జెడ్పీలో ఆ పార్టీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసి ఇంటికి సాగనంపారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్న క్రమంలో.. గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల్లో 99 శాతం వైఎస్సార్‌సీపీనే వరించాయి.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 58 స్థానాల్లో విజయదుంధుభి మోగించారు. అంతకుముందు వరకూ అధికారాన్ని అనుభవించిన టీడీపీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమైన 1995 నుంచి ఇప్పటి వరకూ జిల్లా చరిత్రలో గతంలో ఏ పాలకవర్గంలోనూ ప్రతిపక్ష పార్టీకి ఈ రకమైన పరాభవం ఎదురైన దాఖలాలు లేవు. గత ఏడాది జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం ఎస్సీలకు రిజర్వు అయిన జెడ్పీ చైర్మన్‌ పదవి.. వివాదరహితుడు, విద్యావంతుడు, ఆవిర్భావం నుంచీ పార్టీలో అంకిత భావంతో పని చేస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ ఎస్‌ఈ విప్పర్తి వేణుగోపాలరావును వరించింది.

జెడ్పీ పాలకవర్గం పగ్గాలు చేపట్టాక.. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరిని మూడు జిల్లాలుగా పునర్విభజించారు. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్‌ పాలకవర్గ అస్థిత్వానికి భంగం కలగకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌గానే కొనసాగించారు. 

అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు 
గత ఏడాది నూతన పాలక వర్గం చేపట్టాక జెడ్పీ ద్వారా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘పంచాయతీ సశక్తీకరణ్‌ పురస్కార్‌’ను తొలి ఏడాదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్‌ దివస్‌ అయిన గత ఏప్రిల్‌ 24న 2021–22 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రధాని వర్చువల్‌ విధానంలో అందజేశారు. 

కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన’ అమలులో మన జిల్లా పరిషత్‌ దేశంలోనే తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. 
14వ ఆర్థిక సంఘం నుంచి 21 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.8.73 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సీపీడబ్ల్యూఎస్‌ పథకంలో రూ.16.62 కోట్లు కేటాయించారు. 

సాధారణ పనుల విభాగంలో 260 పనులకు రూ.4.93 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ సంక్షేమానికి రూ.2.14 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.3 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.1.88 కోట్లు, తాగునీటికి రూ.3.32 కోట్లు, సెక్టోరియల్‌ పనులకు రూ.1.43 కోట్లు వెచ్చించారు.

ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనలో 32 గ్రామాలను గుర్తించారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా రూ.20 లక్షల చొప్పున 161 పనులకు రూ.10.65 కోట్లు కేటాయించారు. ఇందులో 49 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 

జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, ఐసీడీఎస్‌ తదితర నిధుల సమన్వయంతో పనులు చేపట్టడంలో దేశంలోనే జిల్లా పరిషత్‌ తృతీయ స్థానంలో నిలిచింది. 

డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ రూరల్‌ అర్బన్‌ మిషన్‌లో రూ.15 కోట్ల అంచనాతో రంపచోడవరం మన్యంలో 73 పనులు చేపట్టారు. వీటిలో 38 ఇప్పటికే పూర్తి చేశారు. 

దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 18 మంది ఎంపీడీఓల కల ఈ పాలకవర్గం హయాంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో సాకారమైంది. 

ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో జెడ్పీలో 10,090 మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.7 కోట్లు జెడ్పీ జమ చేస్తోంది. దీంతో వారందరూ సంతోషంగా ఉన్నారు. 
గత చంద్రబాబు పాలనలో మూడు ఆర్థిక సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టేసిన జెడ్పీ పీఎఫ్‌ను ఒకేసారి పరిష్కరించి రికార్డు సృష్టించారు. రిటైరైన 308 మందికి,  సర్వీసులో ఉన్న 1,717 మందికి ఒకేసారి రూ.101.69 కోట్లు చెల్లించారు. 

అందరి సమన్వయంతో ఏడాది పాలన
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల సమన్వయంతో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశాం. ఎక్కడా ఒక్క వివాదానికి కూడా తావు లేకుండా పని చేయడం చాలా సంతృప్తినిచ్చింది. గత పాలకుల హయాంలో ఉద్యోగులు, రిటైరైన వారికి పెండింగ్‌లో ఉన్న అంశాలను ఒకేసారి క్లియర్‌ చేశాం. జిల్లాపరిషత్‌ అధికారులు, ఉద్యోగులు సమష్టి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకోగలిగాం.
– విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా

మరిన్ని వార్తలు