హోం గార్డ్స్‌.. ఫుల్‌ జోష్‌

6 Dec, 2020 04:33 IST|Sakshi

అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే వేతనాలు పెంచిన జగన్‌ సర్కార్‌ 

వేతన పెంపు, ప్రమాద బీమా వర్తింపుతో హోంగార్డుల జీవితాల్లో వెలుగులు 

నేడు హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే హోంగార్డులకు వేతనాల పెంపు, బీమా వర్తింపు వంటి కీలక వరాలను అమల్లోకి తేవడంతో వారిలో జోష్‌ పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 12 వేల మంది హోంగార్డులు ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం వారి నియామకాలు మరింత పెరిగి మన రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 16,650 మంది ఉన్నారు. పోలీస్‌ శాఖతోపాటు అగ్నిమాపక శాఖ, జైళ్లు, ఆలయాలు, ఎఫ్‌సీఐ, దూరదర్శన్, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ తదితర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోను హోంగార్డులు సేవలందిస్తున్నారు. వేతనాల పెంపు కోసం వారు ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ వచ్చారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పలు జిల్లాల్లో కలిసిన హోంగార్డ్స్‌ ప్రతినిధులు వేతనాల పెంపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాను అధికారం చేపట్టిన వెంటనే వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌ తొలి మంత్రివర్గ సమావేశంలోనే హోంగార్డుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి వేతనం రూ.21,300కు పెరిగింది. ఏదైనా ప్రమాదంలో హోంగార్డు మరణిస్తే రూ.30 లక్షలు బీమా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తీవ్రవాదులు, మావోయిస్టుల దాడుల్లో మృతి చెందితే రూ.40 లక్షలు బీమా వర్తించేలా నిర్ణయం తీసుకుంది.  

1962 డిసెంబర్‌ 6 నుండి రాష్ట్రాల పరిధిలోకి..
దేశ వ్యాప్తంగా 1947 నుంచి హోంగార్డ్స్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 1962 డిసెంబర్‌ 6న హోంగార్డ్స్‌ వ్యవస్థను రాష్ట్రాల పరిధిలోకి తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి డిసెంబర్‌ 6వ తేదీన హోంగార్డ్స్‌ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నారు.  

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం 
పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి మా వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. ప్రస్తుతం ఇస్తున్న నెలకు రెండు సెలవులను ఏడాది మొత్తానికి కలిపి 24 సెలవులను ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించాలి. కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తాం. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డుల రిజర్వేషన్‌ పెంచాలని కోరతాం. 
– ఎస్‌.గోవిందు, అధ్యక్షుడు, ఏపీ హోంగార్డుల సంక్షేమ సంఘం 

హోంమంత్రిని కలుస్తాం 
వేతనాల పెంపు, బీమా వర్తింపు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో హోంగార్డుల వెతలు తీరుతాయనే నమ్మకం ఉంది. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా హోంమంత్రి మేకతోటి సుచరితను ఆదివారం కలిసి విజ్ఞప్తి చేస్తాం.
  – దస్తగిరి బాబు,ప్రధాన కార్యదర్శి, ఏపీ హోంగార్డుల సంక్షేమ సంఘం  

మరిన్ని వార్తలు