గుండెకోతను భరించి...

21 Aug, 2022 04:04 IST|Sakshi
వెంకటేశ్వరమ్మ

బ్రెయిన్‌ డెడ్‌ అయిన భార్య అవయవాలు దానం చేసిన భర్త

దుఃఖాన్ని దిగమింగి తండ్రిని ఒప్పించిన కుమార్తె 

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు రోగులకు కొత్త జీవితం

సాక్షి, అమరావతి: హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం కల్లోలం సృష్టించింది. ఒక మహిళను జీవచ్ఛవంగా మార్చివేసింది. ఇక తన భార్య జీవించడం అసాధ్యమని తెలిసిన ఆమె భర్త గుండెనిండా బాధ ఉన్నా, ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరిని కాపాడేందుకు ముందుకొచ్చారు. తన భార్య అవయవాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన గుంతి నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ(58) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె హిమశైలుష అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, మరో కుమార్తె డాక్టర్‌ బిందుమాధవి విజయవాడ రమేష్‌ ఆస్పత్రిలోని క్రిటికల్‌ కేర్‌ విభాగంలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు.

నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ, మరో ఇద్దరు కలిసి ఈ నెల 13న కారులో ప్రయాణిస్తుండగా చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తలకు తీవ్ర గాయాలైన వెంకటేశ్వరమ్మను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగురోజుల తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో ఈ నెల 17న మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే 18న వెంకటేశ్వరమ్మ బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. 

కుమార్తె చొరవతో... 
ఒకవైపు తన తల్లి వెంకటేశ్వరమ్మకు బ్రెయిన్‌ డెడ్‌ అయిన బాధ, మరోవైపు డాక్టర్‌గా తల్లి అవయవాలతో మరొకరి ప్రాణం నిలపాలన్న సంకల్పం.. తీవ్ర మానసిక సంఘర్షణ పడుతూనే డాక్టర్‌ బిందుమాధవి తన తల్లి అవయవదానానికి తండ్రిని ఒప్పించారు. వెంకటేశ్వరమ్మ నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు స్వీకరించిన వైద్యులు సీనియారిటీ ప్రకారం ఒక కిడ్నీని రమేష్‌ ఆస్పత్రిలోని రోగికి, మరొకదాన్ని ఆయుష్‌ ఆస్పత్రిలోని రోగికి అమర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపారు. లివర్, లంగ్స్, గుండెను గుంటూరు మెడికల్‌ కాలేజీకి తరలించారు.

అవయవదానం చేసేవరకు బ్రెయిన్‌ డెడ్‌ అయిన తల్లిని కుమార్తె బిందుమాధవి దగ్గరుండి వైద్య సేవలు అందిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. అవయవదానానికి ముందుకు వచ్చిన వెంకటేశ్వరమ్మ భర్త నాగేశ్వరరావును, కుమార్తెలు హిమ శైలుష, డాక్టర్‌ బిందు మాధవిని జీవన్‌దాన్‌ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రాంబాబు అభినందించారు. ప్రజలు అవయవదానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు.  

మరిన్ని వార్తలు